సాక్షి, చైన్నె : ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన మాజీలకు పదవులు దక్కనున్నాయి. టీవీకే పార్టీ పరంగా కీలక బాధ్యతలను ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించేందుకు ఆపార్టీ చీఫ్, సీఎం విజయ్ నిర్ణయించారు. వీరితో పాటుగా మరెందరో మాజీలకు సైతం పదవులు అప్పగించేందుకు జాబితా సిద్ధం అవుతున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. అంసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే నుంచి ఎన్నికైన మరకదం కుమారవేల్, జయకుమార్, సత్యభామ, ఇసక్కి సుబ్బయ్య తదితరులు తమ పదవులకు రాజీనామా చేసి, ఆధవ్ అర్జున సమక్షంలో టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మాజీ మంత్రులు ఎం.ఆర్. విజయభాస్కర్, సి. విజయభాస్కర్ కూడా ఎమ్మెల్యే పదవులను వీడి టీవీకేలో చేరారు. వీరే కాకుండా ఎం.సి. సంపత్, కడంబూర్ రాజూ, ఉడుమలైపేట రాధాకృష్ణన్, ఎన్.ఆర్. శివపతి, వెల్లమండి నటరాజన్, వలర్మతి, ఎం.ఎస్.ఎమ్. ఆనందన్ వంటి కీలక నేతలు, మాజీ మంత్రులు సైతం టీవీకే గూటికి చేరారు.
విజయ్ భరోసా..
పార్టీలో చేరినప్పటికీ, నాటి నుంచి టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌ను నేరుగా కలిసే అవకాశం తమకు రాకపోవడంతో ఈ మాజీలు తీవ్ర ఆవేదన , ఆందోళన వ్యక్తం చేస్తూవ స్తున్నారు. పదవుల కేటాయింపు కూడా జరగక పోడంతో వచ్చిన నేతల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు పుదుక్కోటై జిల్లా కార్యదర్శి పదవితో పాటు మళ్లీ విరాళిమలై నుంచి పోటీ చేసి గెలవాలని సి.విజయభాస్కర్, కరూర్ ప్రాంతంలో ప్రాబల్యం సాధించాలని ఎం.ఆర్. విజయభాస్కర్ వ్యూహాలు రచిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ పరిణామాలను టీవీకే ఇక్కడ పాతుకు పోయిన నాయకులు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ జోక్యం చేసుకుని భయపడాల్సిన పనిలేదని, పదవులకు ఎలాంటి ఇబ్బంది కలగదని వారికి భరోసా ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి వచ్చిన వారిలోనూ అసంతృప్తి సెగ అన్నది రాజుకోకుండా సీఎం విజయ్ దృష్టికి ఆనంద్ సమాచారం తీసుకెళ్లినట్టు చర్చ జరుగుతోంది. దీంతో వారికి అభయం, భరోసా ఇచ్చే దిశగా తొలి విడతగా ఆరుగురికి రాష్ట్ర స్థాయి పదవులను పార్టీలో కట్టబెట్టేందుకు విజయ్ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. తొలి విడతలో పదవులకు త్యాగం చేసిన ఆరుగురికి,మలి విడతలో మాజీ మంత్రులైన కడంబూర్ రాజూ, ఎం.సి. సంపత్, ఉడుమలైపేట రాధాకృష్ణన్, ఎన్.ఆర్. శివపతి, వెల్లమండి నటరాజన్, వలర్మతి, ఎం.ఎస్.ఎమ్. ఆనందన్‌లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితా సిద్ధం అవుతోన్నట్టు, పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆమోదంతో మరికొద్ది రోజులలో ఇది విడుదల కానున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని శనివారం పలువురు అన్నాడీఎంకే నేతల చేరిక కార్యక్రమంలో ఆనంద్ వ్యాఖ్యానించడంతో మాజీలలో ఆందనం వెల్లివిరిసింది. అదే సమయంలో వీరికి క్రమ శిక్షణ నేర్పించాల్సిన అవశ్యం కూడా ఉందని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీ పరంగా తమకు ఒక హోదా దక్కినానంతరం తదుపరి అడుగుగా ప్రభుత్వంలో ఏదేని నామినేటెడ్ పదవులు దక్కించుకునే దిశగా ఈమాజీలందరూ వ్యూహ రచనలో ఉండటం గమనార్హం.


