సాక్షి, చైన్నె: తమిళనాడు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్‌గా ఏ. ఉదయన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఉదయన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇది వరకు వండలూరులోని ఉన్నత స్థాయి వన్యప్రాణి సంరక్షణ సంస్థ డైరెక్టర్‌గా సేవలందించేవారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఉదయన్, 1991 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఎఫ్‌ఎస్ అధికారి. తిరుపత్తూర్ జిల్లా అటవీ శాఖ అధికారిగా, తమిళనాడు బయోడైవర్సిటీ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా, తమిళనాడు పర్యావరణ నియంత్రణ మండలి చైర్మన్‌గా వివిధ కీలక పదవులను చేపట్టారు.
పాములు పట్టేవారికి ప్రత్యేక శిక్షణ
తమిళనాడు అటవీ శాఖలో పాములు పట్టే ప్రమాదకరమైన పనికి శాశ్వత ఉద్యోగులు లేకపోవడంతో, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రధానంగా గిరిజన ప్రజలను నియమించి వారికి ఉపాధి కల్పించేవారు. మరోవైపు, జనావాసాల్లోకి వచ్చే పాములను పట్టుకోవడానికి ఫైర్ సిబ్బందికి తగిన శిక్షణ, పరికరాలు లేవని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయన్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా ఫైర్ సిబ్బందికి పాములు సురక్షితంగా పట్టే విధానాలపై శిక్షణనిచ్చి, వారికి కావలసిన ఆధునిక పరికరాలను అందజేశారు.


