సాక్షి, చైన్నె : రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో జనగణన ప్రక్రియకు శనివారం శ్రీకారం చుట్టారు. తమిళనాడులో ఇళ్ల జాబితా తయారీ , గృహ వసతుల నమోదుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. విధులలో 1.15 లక్షల మందిని నియమించారు. మొత్తం రెండు విడతల్లో జరగనున్న ఈ ప్రక్రియలో మొదటి దశ క్షేత్రస్థాయి పరిశీలన ఆగస్టు 30 వరకు కొనసాగనుంది.
స్వయం గణనకు విశేష స్పందన
ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేయడానికి ప్రవేశపెట్టిన స్వయం గణన సౌకర్యం జూలై 17న ప్రారంభమై జూలై 31తో ముగిసింది. ఈ డిజిటల్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తమిళనాడు వ్యాప్తంగా 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇప్పటికే తమ వివరాలను వెబ్‌సైట్ ద్వారా సమర్పించాయి.
క్షేత్రస్థాయి ప్రక్రియ ముఖ్యాంశాలు
డిజిటల్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లేందుకు సుమారు 1.15 లక్షల మంది ఎన్యూమరేటర్లను రంగంలోకి దించారు. సిబ్బంది ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి 33 ప్రశ్నలతో కూడిన జాబితా ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తారు. అందులో నివాస గృహ పరిస్థితి, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్డి సదుపాయం, ఇంటర్నెట్ వసతి, వంట గ్యాస్, వాహనాలు తదితర వివరాలు ఉంటాయి. కాగా, జనాభా గణన చరిత్రలో తొలిసారిగా పేపర్ నమోదు స్థానంలో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. 1948 జనాభా గణన చట్టం ప్రకారం సేకరించిన సమాచారమంతా చట్టబద్ధమైన రక్షణతో అత్యంత రహస్యంగా ఉంచబడుతుందని అధికారులు తెలిపారు. ఈ వివరాలను కేవలం గణాంకాల విశ్లేషణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధివిధానాల రూపకల్పనకు మాత్రమే ఉపయోగిస్తారు. స్వయం గణన పూర్తి చేసిన ప్రజలు తమకు కేటాయించిన వివరాలను ఇంటికి వచ్చే సిబ్బందికి చూపిస్తే సరిపోతుందని, స్వయం గణన చేయని వారి వివరాలను కూడా సిబ్బందే నేరుగా నమోదు చేసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. చైన్నెలో ఉదయం నుంచి పలు వార్డుల వారీగా ప్రాంతాలను విభజించుకుని సిబ్బంది క్షేత్ర స్థాయి జనగనణపై దృష్టి పెట్టారు.


