ఐసీఎఫ్‌ జీఎంగా మనీష్‌ అగర్వాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఐసీఎఫ్‌ జీఎంగా మనీష్‌ అగర్వాల్‌

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

● కోర్టులో నటుడు పార్తీబన్‌ పిటిషన్‌

– బాధ్యతల స్వీకరణ

సాక్షి, చైన్నె: ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌గా మనీష్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. శనివారం ఆయనబాధ్యతలు స్వీకరించారు.ఆయన 1989 బ్యాచ్‌కి చెందిన ఇండియన్‌ రైల్వేస్‌ సర్వీస్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ అధికారి. భారతీయ రైల్వేలలో దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో 35 సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలు అందించారు. కాగా ఐసీఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆయన న్యూఢిల్లీలోని రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మెకానికల్‌)గా డెప్యుటేషన్‌పై సేవలందించారు. ఈ కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోలింగ్‌ స్టాక్‌ నిర్వహణ మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. గతంలో ఆయన దక్షిణ రైల్వేలోని తిరుచ్చి డివిజన్‌ రైల్వే మేనేజర్‌ గా, భోపాల్‌లోని కోచ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌లో చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజర్‌గా, ఇర్కాన్‌ సంస్థలో జనరల్‌ మేనేజర్‌ (మెకానికల్‌)గా వ్యవహరించారు. మధ్యప్రదేశ్‌లోని న్యూ కట్ని జంక్షన్‌ డీజిల్‌ లోకో షెడ్‌లో డీజిల్‌ లోకోమోటివ్స్‌ నిర్వహణలో నూతన ఆవిష్కరణలు, అత్యుత్తమ సేవలు అందించినందుకు గానూ 2006లో ఆయన నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ అవుట్‌స్టాండింగ్‌ సర్వీస్‌ అందుకున్నారు.

సెంథిల్‌ బాలాజీకి

డీవీఏసీ సమన్లు

సాక్షి, చైన్నె : తమిళనాడు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వి. సెంథిల్‌ బాలాజీకి సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించినా, టాస్మాక్‌ అవినీతి కేసులో ఆయన్ను విచారించేందుకు తమిళనాడు అవినీతి నిరోధక శాఖ(డీవీఏసీ) వర్గాలు సన్నద్దమయ్యాయి. ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్‌ మద్యం అక్రమాల కేసులో మద్రాసు హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ, సుప్రీంకోర్టు సెంథిల్‌బాలాజీ అరెస్టుపై తాత్కాలిక స్టే విధించింది. అయితే, పోలీసుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని, పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలని షరతులు విధించింది. దీంతో, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనున విచారించేందుకు సిద్ధమయ్యారు. తమ విచారణాధికారుల ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించి ఉన్నారు. కాగా, టీవీకే ఎమ్మెల్యేలతో బేరసారాల కేసులో గత రెండు రోజులుగా ట్రిప్లికేన్‌పోలీసు స్టేషన్‌కు హాజరు కాని సెంథిల్‌ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌కుమార్‌లు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ నేపథ్యంలో శనివారం పోలీసు ఎదుటహాజరై సంతకం చేసి వెళ్లారు.

జాతి, మత రహిత సర్టిఫికెట్‌ కోసం చట్టం

సాక్షి, చైన్నె : ‘కులం, మతం లేనివారు’ అని ధ్రువీకరించే సర్టిఫికెట్‌ కోరే వారికి తక్షణమే దానిని మంజూరు చేసేలా ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్‌ పార్తీబన్‌ మద్రాస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్‌ను శనివారం దాఖలు చేశారు. గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నటుడు పార్తిబన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘జాతి, మత రహితుడు’ సర్టిఫికేట్‌ను పొందారు. ఆ పత్రాన్ని జస్టిస్‌ దండపాణి ముందు హాజరై చూపించగా, ‘మీరు ఒక్కరు మాత్రమే ఈ లబ్ధి పొందితే సరిపోదు. ఇలాంటి సర్టిఫికేట్‌ కోరుకునే సామాన్య ప్రజలు కూడా లబ్ధి పొందేలా చూడాలి‘ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశంపై తాను పిటిషన్‌ వేయనున్నట్లు పార్తిబన్‌ అప్పట్లోనే ప్రకటించారు.

పిటిషన్‌లోని ముఖ్యాంశాలు

కులం, మతం లేని సర్టిఫికేట్‌ కోరుతూ వచ్చే దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు తగిన మార్గదర్శకాలు, జీవో జారీ చేయాలని 2025 జూన్‌లో తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నటుడు పార్తిబన్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి , న్యాయమూర్తి జి. అరుళ్‌మురుగన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సోమవారం విచారణ సాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement