చైన్నెలో రాహుల్‌ గాంధీకి బ్రహ్మరథం | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో రాహుల్‌ గాంధీకి బ్రహ్మరథం

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

● పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆదేశాలు ● సమష్టిగా ముందుకెళ్లాలని హెచ్చరిక ● అధిష్టానం అన్నీ పరిశీలిస్తున్నట్టు వ్యాఖ్య

సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో మహాబలిపురం 10 రోజుల పాటుగా జరిగిన జిల్లా కాంగ్రెస్‌ నాయకుల శిక్షణా శిబిరం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధికి టీఎన్‌సీసీ వర్గాలు చైన్నెవిమానాశ్రయంతో పాటుగా దారి పొడవను బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో చైన్నె విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ గాంధీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్‌, అఖిల భార త కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శులు, రాష్ట్ర మంత్రులు ఎస్‌.రాజేష్‌ కుమార్‌, పి.విశ్వనాథన్‌, మాజీ అధ్యక్షులు సెల్వపెరుంతొగై, తిరునావుక్కరసర్‌, కే.వి. తంగబాలు తదితర సీనియర్‌ నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు, ‘రాహుల్‌ జీ‘ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. తిరునావుక్కరసర్‌ శాలువా కప్పుతుండగా, రాహుల్‌ గాంధీ ఆయనను గుర్తుపట్టి చాలా కాలమైంది చూసి, ఎలా ఉన్నారు? అని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఆదేశించారు.

రోడ్డు మార్గాన మహాబలిపురం ప్రయాణం

చైన్నె విమానాశ్రయం నుంచి కేలంబక్కం, వండలూరు మీదుగా ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌ ద్వారా 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం వరకు ఆయన కారులో ప్రయాణించారు. ఈ మార్గంలో రహదారికి ఇరువైపులా భారీ బ్యానర్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

శిక్షణ శిబిరం – కీలక ఆదేశాలు

74 మంది జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ, బూత్‌ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేశారు. అనంతరం జిల్లా నాయకుల కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్‌ ఫోటోలు దిగారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకులతో సార్వత్రిక ఎన్నికల అనంతర వ్యూహాలు , రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బలోపేతం లక్ష్యంగా, ఐక్యతతో ముందుకు సాగాలని, రాష్ట్రవ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ పర్యవేక్షిస్తున్నట్టు హెచ్చరించారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

నీట్‌ పరీక్షాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న నలుగురు విద్యార్థుల కుటుంబాలను కూడా రాహుల్‌ గాంధీ కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని రాహుల్‌ గాంధీ రాత్రి 7 గంటలకు చైన్నె విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement