సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని ఆలయాలలో ఉన్న ఏనుగుల కోసం పునరావాస శిబిరం ఈ ఏడాది ఏర్పాటు కానున్నది. ఐదేళ్ల విరామం తర్వాత ముదుమలై శరణాలయానికి ఏనుగులను తరలించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. వివరాలు.. దివంగత సీఎం జే జయలలితకు ఏనుగులు అంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆమె ఏదేని ప్రధాన ఆలయానికి వెళ్లిన సమయంలో ఓ గున్న ఏనుగును కానుకగా అందించేవారు. ఆదిశగా ఆలయ, వ్యక్తిగతంగా ఇతర వ్యక్తుల పర్యవేక్షణలో ఉన్న ఏనుగులను, జంతు ప్రదర్శన శాలల్లో ఉండే ఎనుగుల్ని ఒక చోటికి తరలించి వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, శారీరక ఉత్తేజాన్ని కలిగించే విధంగా 2003లో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్ల ఈ శిబిరం సాగినా, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు మంగళంపాడేశారు. అనంతరం 2011 నుంచి 2021 వరుకు పదేళ్లు అన్నాడీఎంకే హయాంలో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన డీఎంకే మరో మారు పక్కన పడేసినా, ఆలయ ఏనుగుల సంరక్షణ పేరిట స్థానికంగానే కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా రాష్ట్రంలో అధికారం మారింది. ఐదేళ్ల విరామం తదుపరి ఏనుగుల పునరావాస శిబిరంపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది.
నవంబర్‌లో శిబిరం : ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ పునరావాస శిబిరం తిరిగి ప్రారంభం కానుందని సమాచారం వెలువడింది. భక్తులు, జంతు ప్రేమికుల నుంచి వస్తున్న నిరంతర అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, ఆలయాలు , మఠాలలోని 28 ఏనుగులకు ఈ ఏడాది తొలి విడతగా పునరావాస శిబిరంకు కసరత్తులు చేపట్టారు. కోయంబత్తూర్ జిల్లా తేక్కంపట్టి అటవీ ప్రాంతంలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరం నిర్వహణపై సీఎం విజయ్ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుండటంతో దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేశ్ ఇటీవల శిబిరం నిర్వహించనున్న ప్రాంతాన్ని పర్యవేక్షించి మౌలిక వసతుల ఏర్పాట్లను సమీక్షించడం విశేషం. ఆరోగ్య రక్షణ – పోషకాహారం నినాదంతో 48 రోజుల పునరావాస శిబిరంలో ఏనుగులకు అవసరమైన అన్ని రకాల వైద్య చికిత్సలు, ప్రత్యేక నిపుణులచే ఆరోగ్య తనిఖీలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించనున్నారు.


