న్యూస్‌రీల్
దెబ్బతింటున్న 3.50 లక్షల ఎకరాల్లోని వరి
పడిపోయిన భూగర్భ జలమట్టం
లోవోల్టేజీ సమస్యలతో సతమతం
ఆందోళన చెందుతున్న డెల్టా రైతులు
తమిళనాడులోని కావేరి డెల్టా జిల్లాల్లో ప్రతిఏటా రైతులకు తిప్పలు తప్పడం లేదు. కావేరి నదీ జలాలు సకాలంలో రాకపోవడంతో మేట్టూరు డ్యామ్ నిండడంలేదు. ఫలితంగా కురువై సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ఏడాది కూడా కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక నుంచి నీరు కిందకు వదలడంలేదు. దీంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో కురువై సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాల్లో సాగైన వరి పంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీన్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, చైన్నె : తమిళనాడులోని కావేరి డెల్టా జిల్లాల్లో ఈ ఏడాది కురువై (ఖరీఫ్) వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సుమారు 3.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసినప్పటికీ.. భూగర్భ జలమట్టం భారీగా పడిపోవడం, తీవ్రమైన విద్యుత్ లో–వోల్టేజీ సమస్యల కారణంగా మోటార్ల ద్వారా పంట పొలాలకు తగినంత నీరు అందించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు జూలై 20 నుంచి కనీసం 10 రోజుల పాటు మేట్టూరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలని డెల్టా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు
ప్రస్తుతం వరి నాట్లు వేసి 20 రోజులు దాటింది. పైరు ఎదిగే ఈ కీలక దశలో పంటకు నీరు ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. దీనికి తోడు వ్యవసాయానికి త్రీ–ఫేజ్ విద్యుత్ సరఫరా సమయాన్ని తగ్గించడంతో పాటు, విపరీతమైన లో–వోల్టేజీ సమస్యలతో మోటార్లు పనిచేయడం లేదు. దీంతో నీరు అందక పంట పొలాల్లోని నాట్లు ఎండిపోతున్నాయి. తక్షణమే నీరందించకపోతే ఉమ్మడి తంజావూరు, తిరువారూర్ తదితర జిల్లాల వ్యాప్తంగా సాగు చేసిన లక్షలాది ఎకరాల పంట పూర్తిగా ఎండిపోతుందని, దీనివల్ల లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి:
రానున్న ఆగస్టు 3వ తేదీన ఆడి పెరుక్కు (ఆడి 18వ రోజు) పండుగను దృష్టిలో ఉంచుకుని.. తమిళనాడు ప్రభుత్వం జూలై 20 నుంచి జూలై 30 వరకు 10 రోజుల పాటు మేట్టూరు డ్యామ్ నుంచి కావేరి డెల్టా చివరి ఆయకట్టు ప్రాంతం వరకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే డెల్టా ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరిగి, నిలకడగా ఉన్న కురువై వరి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
అడుగంటిన మేట్టూరు డ్యామ్
తెరుచుకోని మేట్టూరు డ్యామ్ గేట్లు
తమిళనాడులోని తిరువారూర్, తంజావూరు, తిరుచ్చి, మైలాడుతురై, నాగపట్నం, కడలూరు, అరియలూరు, పెరంబలూరు, తదితర జిల్లాలను డెల్టా ప్రాంతంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతాలకు సేలం జిల్లా మేట్టూరులోని జలాశయం ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ డ్యామ్ నిండినప్పుడే ఇక్కడ పంటల సాగు ఎక్కువగా ఉంటుంది. గత ఐదేళ్లలో నాలుగేళ్లు నిర్ణీత జూన్ 12వ తేదీ నుంచి డెల్టా సాగు నిమిత్తం మేట్టూరు జలాశయం గేట్లు తెరుచుకున్నాయి. ఈ ఏడాది మేట్టూరు అడుగంటింది. కర్ణాటకతో జల వివాదం నేపథ్యంలో కావేరి నదీ జలాలను తమిళనాడుకు వదలదడం లేదు. దీంతో మేట్టూరు జలాశయం నుంచి చుక్క నీరు కూడా పంటలకు విడుదల చేయలేదు. సాధారణంగా సుమారు ఆరేడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టాల్సి ఉండగా ఈ ఏడాది 3.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగుపై అన్నదాత దృష్టి పెట్టాడు. మేట్టూరు నీరు అందేది ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో విద్యుత్ మోటార్ల సాయంతో భూగర్భ జలాలను నమ్ముకుని సాగును ప్రారంభించిన రైతులకు ప్రస్తుతం మిగిలింది కన్నీళ్లే.
10 గంటలు పడుతున్న వైనం
మేట్టూరు డ్యామ్ నీటి విడుదల, కురువై సాగు విషయమై గణపతి అగ్రహారానికి చెందిన అగ్రగామి రైతు శ్రీనివాసన్ మాట్లాడుతూ..‘‘నదుల్లో నీరు లేకపోవడంతో మోటార్లపైనే ఆధారపడ్డాం. ఇటీవల భూగర్భ జలమట్టం పడిపోవడం, విద్యుత్ సమస్యల వల్ల ఎకరానికి గతంలో 3 గంటల్లో పారే నీటి కోసం ఇప్పుడు ఏకంగా 10 గంటల సమయం పడుతోంది. ఎండ తీవ్రత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా తంజావూరులోని 1.50 లక్షల ఎకరాలతో పాటు, ఉమ్మడి డెల్టా వ్యాప్తంగా సాగవుతున్న 3.50 లక్షల ఎకరాల వరి పంట భవిష్యత్తు ప్రమాదంలో పడింది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నార్థకంగా ‘కురువై’ సాగు


