భూస్కాం విచారణ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

భూస్కాం విచారణ వేగవంతం

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

● పరారీలో ముగ్గురు నిందితులు ● సీబీసీఐడీ ముమ్మర వేట

సాక్షి, చైన్నె : దిండిగల్‌ జిల్లా పళనికొండ దిగువన ఉన్న ప్రముఖ దండపాణి స్వామి మఠానికి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారం తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో భూమిని విక్రయించిన వ్యక్తితో పాటు, కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం సీబీసీఐడీ పోలీసులు ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు. పళనికొండ దిగువ ప్రాంతంలో దండపాణి స్వామి మఠానికి చెందిన 1.40 ఎకరాల అత్యంత విలువైన భూమి అక్రమ రిజిష్ట్రేషన్‌ వ్వవహారం దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. అక్రమంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన పళని సబ్‌ రిజిస్ట్రార్‌ జస్టిన్‌ మణికంఠన్‌, భూమిని అక్రమంగా విక్రయించిన మఠం ట్రస్ట్‌ సభ్యుడు మురుగదాస్‌, భూమిని కొనుగోలు చేసిన ఉడుమలైపేట సమీపంలోని పాపాకుళానికి చెందిన వైళ్లెదురై, పళని సమీపంలోని టీ.కే.ఎన్‌.పుదూర్‌కు చెందిన సేతుపతిపై పళని అడివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రిజిస్ట్రేషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. అదే సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ జస్టిన్‌ మణికంఠన్‌తో పాటు, అతనికి సహకరించిన జిల్లా రిజిస్ట్రార్‌ శశికళను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

రంగంలోకి దిగిన సీబీసీఐడీ

తమిళనాడు డీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీసీఐడీ విభాగానికి అప్పగించారు. దిండిగల్‌ సీబీసీఐడీ డీఎస్పీ అజయ్‌ తంగం నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం శుక్రవారం రంగంలోకి దిగింది. మఠం స్థలం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులు మురుగదాస్‌, వైళ్లెదురై, సేతుపతి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

పళని భూకుంభకోణంపై డీఎంకే నిప్పులు

ఈ కుంభకోణంపై డీఎంకే లీగల్‌ వింగ్‌ జాయింట్‌ సెక్రటరీ పరంధామన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పళనికొండపై భక్తులు తలనీలాలు (గుండు) సమర్పించుకోవడం చూసుంటామని, విజయ్‌ ప్రభుత్వం ఏకంగా ఆ పళనికే మొండిచేయి చూపించి గుండు కొట్టించి, తమిళనాడు ప్రజల ముఖాన విభూతి రాసిందని ఎద్దేవా చేశారు. ఈ భారీ స్కామ్‌పై ముఖ్యమంత్రి విజయ్‌ ఎందుకు నోరు మెదపడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభం కాకముందే హిందూ దేవాదాయ శాఖ మంత్రి రమేష్‌ మాట్లాడుతూ అధికారులు అజ్ఞానంతో ఈ రిజిస్ట్రేషన్‌ చేసేశారని అని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దర్యాప్తుకు ముందే మంత్రి ఇలా మాట్లాడడం నిందితులను కాపాడే ప్రయత్నం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఒకవేళ విచారణ నిష్పక్షపాతంగా సాగకపోతే తాము కోర్టును ఆశ్రయిస్తామని పరంధామన్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement