కోవై కార్పొరేషన్‌లో తీవ్ర దుమారం | - | Sakshi
Sakshi News home page

కోవై కార్పొరేషన్‌లో తీవ్ర దుమారం

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

● రూ.40 కోట్ల అవినీతి ఆరోపణలు ● కాంగ్రెస్‌ కార్పొరేటర్లు రెండు నెలలు సస్పెన్షన్‌

సాక్షి, చైన్నె : కోయంబత్తూరు కార్పొరేషన్‌ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం రణరంగంగా మారింది. ప్రతిష్టాత్మక క్లాసికల్‌ లాంగ్వేజ్‌ పార్క్‌ పనుల్లో దాదాపు రూ.40 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలు సభలో తీవ్ర ఘర్షణకు దారితీశాయి. దీనిపై మేయర్‌ సమాధానం చెప్పాలంటూ కార్పొరేటర్లు పట్టుబట్టడంతో సభ అదుపు తప్పింది. ఈ క్రమంలో నిరసనకు దిగిన కాంగ్రెస్‌ మహిళా కార్పొరేటర్లను రెండు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ మేయర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మేయర్‌, కమిషనర్‌ ముట్టడి.. తోపులాట

టౌన్‌ హాల్‌లోని విక్టోరియా హాల్‌లో మేయర్‌ రంగనాయకి అధ్యక్షతన, కార్పొరేషన్‌ కమిషనర్‌ కట్టా రవి తేజ, డిప్యూటీ మేయర్‌ వెట్రి సెల్వన్‌ సమక్షంలో శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమైంది. ఈ క్రమంలో జోనల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ (ప్లాట్ల రెగ్యులరైజేషన్‌) ప్రత్యేక శిబిరాల సమాచారాన్ని అధికారులు, కార్పొరేటర్లకు ముందస్తుగా తెలియజేయలేదంటూ సెంట్రల్‌ జోన్‌ చైర్మన్‌ మీనా లోగు నిలదీశారు. జోక్యం చేసుకున్న కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ గాయత్రి నేతృత్వంలోని సభ్యులు హఠాత్తుగా మేయర్‌, కమిషనర్‌ను ముట్టడించారు. సెమ్మొళి పూంగా పనుల్లో జరిగిన రూ.40 కోట్ల కుంభకోణంపై మేయర్‌ రంగనాయకి నోరు విప్పాలని, పారదర్శకమైన వివరణ ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.

కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సస్పెన్షన్‌..

సభ వాయిదా

సభను శాంతింపజేసేందుకు మేయర్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సభ్యుల ఆందోళన మితిమీరడంతో మేయర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభకు అంతరాయం కలిగించినందుకు గానూ కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ గాయత్రి నేతృత్వంలోని సభ్యులను రెండు నెలల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ సభ్యుల నిరసనలు, వాగ్వాదాలు తగ్గకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఖాళీ కుండలతో అన్నాడీఎంకే నిరసన

మరోవైపు కోయంబత్తూరు నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే కార్పొరేటర్లు రమేష్‌, ప్రభాకరన్‌, షర్మిళా ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కనీసం 15 రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదని, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు మంచినీటి సమస్యపై ప్రతిపక్షాల నిరసనలతో కోయంబత్తూరు కార్పొరేషన్‌ సమావేశం తీవ్ర గందరగోళం మధ్య సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement