బుల్లెట్‌ వేగం! | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ వేగం!

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

● రైలు ప్రాజెక్టుకు రూ.18 వేల కోట్లు ● సమగ్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధం

సాక్షి, చైన్నె : దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చైన్నె–బెంగళూరు హై–స్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. భారతదేశపు మూడవ హై–స్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుగా నిలవనున్న ఈ కారిడార్‌ ప్రాథమిక నిర్మాణ పనుల కోసం టెండర్‌ ప్రక్రియ ఊపందుకుంది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారతీయ రైల్వే సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. నేషనల్‌ హై స్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ జారీ చేసిన కొత్త టెండర్‌ నిబంధనల ప్రకారం, సవరించిన కొత్త రూట్‌ మ్యాప్‌ రూపకల్పన బాధ్యతను కాంట్రాక్టరుకు అప్పగించనున్నారు.

రూ.18,000 కోట్ల భారీ బడ్జెట్‌

ఈ ప్రతిష్టాత్మక బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.17,000 కోట్ల నుంచి రూ. 18,000 కోట్లుగా లెక్కగట్టారు. ఈ ప్రాజెక్టును 2035 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రైల్వే లైన్‌ మార్గంలోని సుమారు 41 గ్రామాల్లో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

చైన్నె నగరంలో రూట్‌

ఈ రైలు మార్గం చైన్నె సెంట్రల్‌ నుంచి బయలుదేరి పెరంబూర్‌, కొలత్తూరు, ఐసీఎఫ్‌ మాధవరం, పాడి, చైన్నె బైపాస్‌, చైన్నె–తిరువళ్లూరు హైవే, అరక్కోణం రీచ్‌ మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే సమాంతరంగా అనుసరిస్తూ రైల్వే లైన్‌ను నిర్మిస్తారు. పూందమల్లి స్టేషన్‌ను ఔటర్‌ రింగ్‌ రోడ్‌, మెట్రో స్టేషన్లతో అనుసంధానించనున్నారు. మొత్తం కారిడార్‌ మార్గంలో సుమారు 28 కిలోమీటర్ల మేర లైన్‌ను భూగర్భంలో (అండర్‌ గ్రౌండ్‌) నిర్మించనున్నారు. మిగిలిన మార్గమంతా పిల్లర్లపై ఎలివేటెడ్‌ (ఎత్తైన) కారిడార్‌గా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడిన మూడు ప్రధాన సొరంగాల్లో చైన్నె సెంట్రల్‌ సొరంగం కూడా ఉంది.

గంటకు 350 కి.మీ వేగం

గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్‌ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే, చైన్నె – బెంగళూరు నగరాల మధ్య రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 7 గంటల సమయం పడుతోంది. బుల్లెట్‌ రైలు ద్వారా గంట కంటే తక్కువలోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ హై–స్పీడ్‌ రైలు మార్గంలో మొత్తం 8 ప్రధాన రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో చైన్నె సెంట్రల్‌, పూందమల్లి, అరక్కోణం తమిళనాట ఉన్నాయి. చైన్నెలో రాబోతున్న పరందూరు కొత్త గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి అనుసంధానంగా భవిష్యత్తులో పరందూరును కూడా ఒక స్టేషన్‌గా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement