●వాస్తవ సమాచారం ఇవ్వండి ●తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ పిలుపు
సాక్షి, చైన్నె: తమిళనాడు భవిష్యత్తు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు అత్యంత కీలకమైన జనాభా గణన ప్రక్రియ శుక్ర వారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం సి.జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ జనాభా గణన అంకెలకు సంబంధించిన విష యం కాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రాతిపదిక అని తెలిపారు. 2011 తర్వాత రాష్ట్రంలో జనగణన చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయబోయే అన్ని ప్రజా సంక్షేమ పథకాలకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం గణన అధికారులకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఆన్‌లైన్‌లోనూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని, తాను కూడా వివరాలు నమోదు చేసుకున్నానని పేర్కొన్నారు. ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలన్నీ సురక్షితంగా, గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ‘‘రండి, మనమందరం కలిసి ఈ జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ప్రజా సంక్షేమం కోసమే ఈ జనాభా గణన’ ’అంటూ సీఎం విజయ్ రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యులు కావాల్సిందిగా పిలుపునిచ్చారు.
9 రైల్వే స్టేషన్లు జాతికి అంకితం
సాక్షి, చైన్నె : దక్షిణ రైల్వే పరిధిలో పూర్తయిన తొమ్మిది అమృత్‌భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పునర్నిర్మించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పంజాబ్‌లోని జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ రైల్వే పరిధిలో రైల్వే స్టేషన్లలో చైన్నె పార్క్ (చైన్నె డివిజన్), చిన్నసేలం (సేలం డివిజన్), కూనూర్ (సేలం డివిజన్) తదితర తొమ్మిది స్టేషన్లు ఉన్నాయి. చైన్నె పార్క్ స్టేషన్‌లో జరిగిన వేడుకల్లో తమిళనాడు – కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ప్రముఖ టెక్స్‌టైల్ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ గ్రహీత నల్లి కుప్పుసామి చెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నసేలం, కూనూర్‌లో ఎంపీ డి.మలైయరసన్, ఎమ్మెల్యేలు రాకేష్, ఎం.రాజు, ఎం.ద్రావిడ మణి, ఎం.భోజరాజన్ పాల్గొన్నారు.
కేసును సీబీఐకి అప్పగించాలి
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై అన్నాడీఎంకే చీఫ్ విప్ అగ్రి కృష్ణమూర్తి, ఎంపీ ఇన్బదురై శుక్రవారం తమిళనాడు డీజీపీని కలిసి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. అగ్రి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల బేరసారాలను అడ్డుకోవాలని చూస్తున్నాం. ఈ వ్యవహారంపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే డీజీపీని ఆశ్రయించాల్సి వచ్చింది. టీవీకే ప్రభుత్వం ఇప్పటికే ఆరుగురు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. వారు తమ పదవులకు రాజీనామా చేసిన వెంటనే టీవీకే సభ్యత్వ కార్డులు ఇస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి కొనుగోళ్లు జరగలేదని వారు బుకాయిస్తున్నారు అని తెలిపారు. అన్నాడీఎంకేలో ఎలాంటి అంతర్గత సమస్యలు, వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాము డీఎంకేతో ఎలాంటి చర్చలు జరపడం లేదని తెలిపారు.
కేసును సీబీఐకి అప్పగించాలి
ఎంపీ ఇన్బదురై మాట్లాడుతూ టీవీకే ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిగాయన్న కేసును తమిళనాడు పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? నా కేసులో నేనే న్యాయమూర్తిగా ఉండలేను కదా. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడింది డీఎంకే అయినా, టీవీకే అయినా తప్పే. మేము ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు ఎందుకు విచారణ ప్రారంభించలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సీఎం విజయ్ ప్రధాన నిందితుడని ఆరోపించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే లు ఉన్న చోటుకు ఆయనే స్వయంగా వెళ్లారని గుర్తు చేశారు. అక్కడున్న సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ జరపాలని, నిజంగానే అది పరిశుద్ధమైన ప్రభుత్వమే అయితే.. అన్ని విషయాలను బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.


