చైన్నె, తిరుచ్చి, కోవై, మదురైపై ప్రత్యేక దృష్టి
2031 నాటికి మురికివాడలు లేని నగరాలే లక్ష్యం
సీఎం విజయ్ నిర్ణయం
సాక్షి, చైన్నె : తమిళనాడులోని చైన్నె, తిరుచ్చి, కోవై, మదురై నగరాలకు మహర్దశ పట్టనుంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన శుక్రవారం చైన్నె సచివాలయంలో గృహ, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి, ప్రజా గృహ నిర్మాణ పథకాలపై చర్చించారు. 2031 నాటికి తమిళనాడులోని నగరాలను మురికివాడలు లేని నగరాలుగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించేందుకు విస్తృత చర్చలు జరిగాయి. ఇందుకోసం అమలు చేయాల్సిన ప్రణాళికలు, పనులపై ముఖ్యమంత్రి అధికారులతో సంప్రదించారు. పట్టణ జనాభాలోని అన్ని వర్గాలకు నాణ్యమైన గృహవసతి కల్పించడం, పరిశుభ్రమైన, సురక్షితమైన పట్టణ జీవనాన్ని ప్రోత్సహించడంపై పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరేలా ఈ పథకాలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా తమిళనాడు భవిష్యత్ పట్టణాభివృద్ధికి రూపమివ్వడానికి చైన్నె, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు ప్రధాన నగరాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఉన్నతీకరించాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. మౌలిక సదుపాయాలు, రవాణా, రద్దీ నివారణ, పచ్చని ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రయోజనం కోసం ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సింగిల్ విండో విధానం ప్రస్తుత స్థితిపై చర్చించారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, ఆలస్యం లేకుండా సహాయం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


