సామాన్యుడికి కార్పొరేట్‌ వైద్యం..! | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి కార్పొరేట్‌ వైద్యం..!

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

నలం టీఎన్‌ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

రూ. 139 కోట్లతో వైద్య భవనాలు ప్రజలకు అంకితం

వైద్యులు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లకు

నియామక ఉత్తర్వులు

అందజేసిన సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుడికి సైతం నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తునట్టు సీఎం విజయ్‌ ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్యం, ఆరోగ్య సంరక్షణ దిశగా నలం టీఎన్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. చైన్నెలోని ప్రెసిడెన్సీ కాలేజీ (స్టేట్‌ కాలేజ్‌) ఆవరణలో వైద్య , ప్రజా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.

రూ.139.47 కోట్లతో వైద్య భవనాలు

ఈ వేదిక నుంచి సీఎం విజయ్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో చైన్నె కీల్పాక్‌ మెడికల్‌ కాలేజ్‌లో రూ.17 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు 4 అంతస్తుల భవనం, 30 పడకల ఐసీయూ వార్డు, 180 పడకల జనరల్‌ వార్డు, నర్సింగ్‌ స్టేషన్లు ల్యాబ్‌లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడానికి వివిధ జిల్లాల్లో రూ.45.50 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన 78 ప్రాథమిక , ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 1,832 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 345 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,071 అసిస్టెంట్‌ డాక్టర్ల పోస్టులలో మొదటి విడతగా 320 మందికి ఇప్పటికే నియామక పత్రాలు ఇవ్వగా, మిగిలిన 751 మందికి కౌన్సెలింగ్‌ పూర్తి చేసి తాజాగా నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందజేశారు.

సామాన్యురాలి సాయం

చైన్నెకి చెందిన ఎస్‌. సత్య అనే మహిళ.. రెండేళ్ల క్రితం ఎగ్మూర్‌ ప్రసూతి ఆసుపత్రిలో తనకు కాన్పు అయిన సమయంలో వైద్యులు, నర్సులు అందించిన అంకితభావంతో కూడిన సేవలకు కృతజ్ఞతగా, ఆ ఆసుపత్రి చిల్లర ఖర్చుల కోసం సీఎం సమక్షంలోనే క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా రూ.1,000 విరాళంగా అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈసందర్భంగా ఆరోగ్య మంత్రి అరుణ్‌ రాజ్‌ మాట్లాడుతూ, పారదర్శకంగా అన్ని రకాల విరాళాల సేకరణ ఉంటుందని, సర్కారీ ఆస్పత్రులలో కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు సీఎం విజయ్‌ విస్తృతం చేయనున్నారని ప్రకటించారు.

నలం టీఎన్‌ ఆవిష్కరణ

రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా, మౌలిక వసతులు , అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడానికి తమిళనాడు హెల్త్‌ ఫౌండేషన్‌ పరిధిలో రూపొందించిన ‘నలం టీఎన్‌’ అనే కొత్త వెబ్‌సైట్‌ను సీఎం విజయ్‌ ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పెద్ద పరిశ్రమల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ వైద్య విద్యార్థులు , వ్యక్తిగత దాతలు ఎవరైనా సరే.. అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. ఈ ఆవిష్కరణతో కొన్ని గంటలో కేప్లిన్‌ పాయింట్‌ లాబొరేటరీస్‌ లిమిటెడ్‌ సంస్థ చైర్మన్‌ సి.సి. పార్థిబన్‌, వైస్‌ చైర్మన్‌ వివేక్‌ పార్థిబన్‌ తమ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.1 కోటి చెక్కును సీఎంకు అందజేశారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ కృష్ణన్‌ అఖిలేశ్వరన్‌, సీఈఓ వి. నవీన్‌ రూ. కోటి చెక్కును అందజేశారు. టైటాన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆటోమేషన్‌ లిమిటెడ్‌ (హోసూర్‌: సంస్థ అధికారులు ఆర్‌. ప్రభు, హరిహరన్‌ ప్రభుత్వ ఆసుపత్రుల భవన నిర్మాణాల కోసం రూ.60 లక్షల చెక్కును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement