రాజీ పరిష్కార కేంద్రానికి మంత్రి మరియా విల్సన్‌ | - | Sakshi
Sakshi News home page

రాజీ పరిష్కార కేంద్రానికి మంత్రి మరియా విల్సన్‌

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

సాక్షి, చైన్నె: ఆస్తి వివాదంలో సొంత సోదరుడి ఇంట్లోకి చొరబడి దాడి చేసిన కేసులో.. పరస్పర రాజీ చర్చల నిమిత్తం తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి మరియా విల్సన్‌ హైకోర్టు ప్రాంగణంలోని రాష్ట్ర రాజీ పరిష్కార కేంద్రానికి స్వయంగా హాజరయ్యారు. చైన్నెలోని ఆర్‌.కే. నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత తమిళనాడు ఆర్థిక మంత్రి అయిన మరియా విల్సన్‌పై గతంలో పుదుచ్చేరిలో ఒక కేసు నమోదైంది. ఆస్తి తగాదాల కారణంగా.. పుదుచ్చేరి ఎళిల్‌ నగర్‌లో నివసిస్తున్న ఆయన సోదరుడు మరియా కులోత్‌ ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి, మరియా కులోత్‌ , ఆయన భార్య కెరోలిన్‌ను కరల్రతో గాయపరిచినట్లు లాస్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం పుదుచ్చేరి మొదటి క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాన్ని ఇరుపక్షాలు కూర్చొని రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తరపున కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి.. ఈ కేసును హైకోర్టులోని రాజీ పరిష్కార కేంద్రానికి బదిలీ చేస్తూ, ఇరువర్గాలు అక్కడ హాజరుకావాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం మంత్రి మరియా విల్సన్‌ తన సీనియర్‌ న్యాయవాదులు ఖాజా మొయిద్దీన్‌ హిస్తీ, రాజా శ్రీనివాసన్‌లతో కలిసి తమిళనాడు రాజీ పరిష్కార కేంద్రంలో జడ్జి బాలసుబ్రమణియన్‌ ఎదుట హాజరయ్యారు. ఆయన సోదరుడు మరియా కులోత్‌ కూడా తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. అయితే వారిమధ్య ఎలాంటి స్పష్టమైన అంగీకారం కుదరలేదు. దీంతో ఈ చర్చల విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.

విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు

– మంత్రి రాజ్‌ మోహన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వక్తృత్వ , వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నామని విద్యా మంత్రి రాజ్‌ మోహన్‌ తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన వారికి రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేల నగదుతో పాటూ ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. చైన్నె ప్రావినన్స్‌కు (మద్రాస్‌ ప్రెసిడెన్సీ) తమిళనాడు అని పేరు మార్చిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని ఏటా తమిళనాడు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా తమిళ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఇది కేవలం ఒక సాధారణ పోటీ మాత్రమే కాదని, తమిళ భాషా విశిష్టతను, తమిళనాడు ఘనమైన చరిత్రను చాటిచెప్పే ఒక గొప్ప పండుగ అని వ్యాఖ్యానించారు.

స్థానికంలో సీపీఐ ఒంటరి సమరం

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి తమకు బలం ఉన్న చోట్ల మరింత బలాన్ని చాటుకునేందుకు సీబీఐ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీర పాండియన్‌ స్పందిస్తూ, ఎన్నికల సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని, ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే కమ్యూనిస్టులు ఆ పని కూడా చేయగలరని స్పష్టం చేశారు. మంగళవారం చైన్నెలో విలేకరులతో వీరపాండియన్‌ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ ఎన్నికలైనా సరే.. అప్పటి రాజకీయ వాతావరణాన్ని బట్టి సీపీఐ తన నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడితే, కమ్యూనిస్టులు సొంతంగానే ఎన్నికలను ఎదుర్కొంటారని స్పష్టంచేశారు. ఇక్కడ కమ్యూనిస్టులకు బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఉందని, ప్రజలకు తమ సేవలు తెలుసునని, అవసరం వస్తే ఒంటరిగా పోటీ చేయడంపై పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం సీపీఐ, సీపీఎం, లెనినిస్టులు కలిసి తమిళనాడులో ఒక వామపక్ష సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేశామన్నారు. ఇది ఎన్నికల కోసం ఏర్పడిన కూటమి కాదు. తమిళనాడు ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం సంయుక్తంగా పోరాడేందుకు ఏర్పాటైన వేదికగా వివరించారు.రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈసందర్భంగా ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను, పార్టీల మనుగడను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తాయన్నారు. ప్రజల్లో రాజకీయాల పై అసహ్యం, విరక్తి కలిగించేలా చేస్తాయన్నారు. ఎవరి సిద్ధాంతాల ప్రకారం వారు రాజకీయాలు చేయడమే సరైన పద్ధతిగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement