స్వస్థలాలకు వియత్నాం బాధితుల మృతదేహాలు | - | Sakshi
Sakshi News home page

స్వస్థలాలకు వియత్నాం బాధితుల మృతదేహాలు

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

● శోక సంద్రంలో కుటుంబీకులు

సాక్షి, చైన్నె : వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన తమిళనాడుకు చెందిన 10 మంది మృతదేహాలు మంగళవారం చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అనంతరం అధికారులు వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. విమానాశ్రయంలో మృతదేహాలకు వేలూరు ఎమ్మెల్యే వినోద్‌ కణ్ణన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివరాలు.. వియత్నాంలోని దీవిలో ఈనెల 11న పడవ బొల్తా పడ్డ విషయం తెలిసిందే. ఒక ప్రముఖ మొబైల్‌ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విహారయాత్రకు వెళ్లిన వారిలో తమిళనాడు వాసులు ఉన్నారు. పడవ ప్రమాదంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది మంది మరణించారు. వీరి మృత దేహాలు వియత్నాం నుంచి ముంబైకు అర్థరాత్రి సమయంలో చేరుకున్నాయి. వీటిని చైన్నె,తిరుచ్చి,కోయంబత్తూరు విమానాశ్రయాలకు వేర్వేరుగా తరలించారు. వీరిలో పళనికి చెందిన మురుగప్రభు, తిరుచ్చికి చెందిన అళగురాజన్‌, బాలాజీ, షేక్‌ అబ్దుల్లా భౌతికకాయాలను తిరుచ్చి విమానాశ్రయంకు చేర్చారు. ధర్మపురికి చెందిన సెంథిల్‌కుమార్‌ ,సేలంకు చెందిన శ్రీధర్‌ మృత దేహాలు కోయంబత్తూరుకు చేరుకున్నాయి. గుమ్మిడిపూండికి చెందిన బాబు, రవిశంకర్‌, వేలూరుకు చెందిన సంతోష్‌ కుమార్‌ మృత దేహాలు చైన్నెకు చేర్చారు. వీటిని కుటుంబీకులకు అధికారులు అప్పగించారు. ఆయా విమానాశ్రయాల నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసు పహార నడుమ వారి వారి స్వస్థలాలకు తీసుకెళ్లారు.కుటుంబీకులు ,ఆప్తులు మృత దేహాలను చూసి తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం ఆయా ప్రాంతాలలో బాధిత కుటుంబాలు తమ వారి మృత దేహాలకు అంత్యక్రియలను నిర్వహించాయి.

ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఏమన్నారంటే...

ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి చైన్నె చేరుకున్న పళనికి చెందిన నిర్మల్‌ కుమార్‌ ఆనాటి భయానక పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. ‘‘మేం ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్తుండగా ఒక్కసారిగా పడవ తలకిందులైంది. పడవ అంచున ఓపెన్‌ ఏరియాలో కూర్చున్న 20 మంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే, ఆ పడవ పైభాగం పూర్తిగా మూసివేసి ఉండటంతో లోపల కూర్చున్న 15 మంది సకాలంలో బయటకు రాలేకపోయారు’ అని ఆందోళనవ్యక్తం చేశారు.సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం 10 నిమిషాల సమయం పట్టిందన్నారు. అందుకే నీటిలోకి దూకిన వారు మాత్రమే బతికారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ అధికారులు ఎంతో సహాయం చేశారన్నారు. తమకు అవసరమైన వైద్య సేవలు, ఇతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేశారని నిర్మల్‌ కుమార్‌ కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement