తిరువళ్లూరు: జ్వరంతో 8 నెలల కిందట మృతి చెందిన ఓ ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని సోమవారం వెలికితీసి శవపరీక్ష నిర్వహించిన ఘటన స్థానికంగా చర్చినీయాంశమైంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు తాలుకా అత్తపట్టుసెల్లియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన శీను అలెగ్జాండర్. ఇతనికి భార్య జిషాతో పాటూ ఐదేళ్ల కుమార్తె నెస్‌లిన్‌రియా ఉంది. సాధారణ జ్వరం రావడంతో గత ఏడాది డిసంబర్ 3న అంబత్తూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నెస్‌లిన్‌రియాను చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన క్రమంలో బాలిక డిసెంబర్ 4న మృతి చెందింది. బాలిక సొంత గ్రామమైన తిరువళ్లూరు సమీపంలోని మప్పేడు వద్ద డిసంబర్ ఐదున అంత్యక్రియలను నిర్వహించారు. కాగాసరైన వైద్యం అందించకపోవడం వల్లే బాలిక మృతి చెందిందని ఆరోపించిన మృతురాలి తల్లి ఈమేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌లోనూ ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతికి కారణమైన ప్రైవేటు వైద్యశాల నిర్వాహకురాలు సరోజిని, అమె కుమారుడు రాజా తదితర ఇద్దరు డాక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఐఎంసీ విచారణ చేసిన క్రమంలో ఇద్దరిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయాలని సూచించారు. దీంతో పాటూ బాలిక మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని సైతం ఆదేశించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు ఆర్డీవో రవిచంద్రన్, తాహశీల్దార్ శరణ్య తదితరుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్యుల బృందం సోమవారం మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్షను నిర్వహించారు.


