● సేవల విస్తృతమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాలయం ● యాప్ ఆవిష్కరణ
భవిష్యత్ ప్రాజెక్టుల జాబితా సిద్ధం
నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. వ్యాసార్పాడి అంబేడ్కర్ కళాశాల అభివృద్ధి, అక్కడ క్రీడా సౌకర్యాల కల్పన, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం ప్రత్యేక గ్రంథాలయం , అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు శర్మానగర్‌లో అధునాతన ఆసుపత్రి, తల్లి–పిల్లల సంక్షేమ కేంద్రం, పాఠశాలల ఆధునీకరణ, బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల ప్రోత్సాహక కేంద్రాల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం పెరంబూరులోని పలు విధులలో రోడ్‌షో నిర్వహించారు.
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ గెలిచారు. అయితే, ఆయన తిరుచ్చి ఈస్ట్‌ను రాజీనామా చేసి, పెరంబూరు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు నిర్ణయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన, సిఎంగా పగ్గాలు చేపట్టిన రెండు నెలల తదుపరి ప్రపథమంగా తన నియోజకవర్గం పెరంబూరు ప్రజల్ని పలకరించేందుకు సాయంత్రం 3 గంటలకు సిద్ధమయ్యారు. తన సొంత నియోజకవర్గమైన పెరంబూర్ పరిధిలోని వ్యాసర్‌పడి శర్మానగర్ కొత్తగా ఆధునీకరించిన శాసనసభ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడ తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీలో కూర్చుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్థానిక సమస్యలు, పనులపై దృష్టి పెట్టారు.
మొబైల్ యాప్ ఆవిష్కరణ – సంక్షేమ సాయం
ఈ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ’మక్కల్ సేవా తళం’( ప్రజా సేవా వేదిక –పీపుల్స్ సర్వీస్ ప్లాట్‌ఫామ్) అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను సీఎం విజయ్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతంలోని తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి ప్రాథమిక సమస్యలను నేరుగా నమోదు చేయవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, వాటికి అర్హతలను తెలుసుకోవడంతో పాటు, తాము ఇచ్చిన ఫిర్యాదుల ప్రస్తుత స్థితి ని కూడా చెక్ చేసుకోవచ్చు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, ఉచిత గృహ నిర్మాణ భూమి పట్టాలను పంపిణీ చేశారు.
విద్యాశాఖ అధికారులతో సీఎం విజయ్ కీలక సమీక్ష
అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం విజయ్ గత వారం రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ముమ్మరంగా తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, సోమవారం ఉదయం పాఠశాల విద్యాశాఖతో పాటుగా పలు విభాగాలు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం విజయ్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్, ఆర్థిక మంత్రి మరియా విల్సన్, విద్యాశాఖ కార్యదర్శి చంద్రమోహన్ పాల్గొన్నారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారులు ఒక నివేదికను సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం టెట్ పరీక్ష ఉత్తీర్ణులై పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతమంది? అలాగే ఈ పరీక్ష రాయకుండా ఇంకా ఎంతమంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు? అనే సమగ్ర సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు సీఎం విజయ్‌కు ఈ సమావేశంలో సమర్పించారు. ప్రతి విద్యా సంవత్సరం పాఠశాల విద్యలో అంతర్జాతీయంగా అత్యుత్తమంగా రాణిస్తున్న వివిధ దేశాలకు ఇక్కడి అర్హత గల ఉపాధ్యాయులను పంపి, అక్కడ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించే సరికొత్త ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ, రాబోయే విద్యాశాఖ బడ్జెట్‌లో చేర్చాల్సిన సరికొత్త ప్రజా ఉపయోగకర కార్యక్రమాలపై సీఎం విజయ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఆధునిక వసతులు, ఈ–సేవా కేంద్రం
నెలరోజులకు పైగా ఇక్కడ జరిగిన పునరుద్ధరణ పనుల తర్వాత ఈ కార్యాలయం సరికొత్త వసతులతో సిద్ధమైంది. ప్రజలు కూర్చోవడానికి ప్రత్యేక సీటింగ్, వినతిపత్రాలు సమర్పించడానికి రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన 240 రకాల సేవలను ప్రజలకు నేరుగా అందించేందుకు వీలుగా ఇక్కడ ఒక ప్రభుత్వ ఇ–సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులను వెంటనే కంప్యూటర్‌లో నమోదు చేసి, సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.


