సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త వైద్య బీమా పథకం ప్రకటించింది. అయితే, ఇందులో క్యాటరా, హిస్టరెక్టమీ వంటి చికిత్సలను మినహాయించడంపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం గతంలో ప్రవేశపెట్టిన వైద్య బీమా పథకాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. గత డీఎంకే పాలనలో ఏడాదికి రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం పొందేలా ఈ పథకాన్ని పొడిగించారు. పాత ఇన్సూరెన్స్ గడువు జూన్ 30తో ముగియడంతో, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2031 జూన్ 30 వరకు వర్తించే సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రకటించింది.
ప్రీమియం వివరాలు – చికిత్స పరిమితి
ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరానికి రూ. 4,500 ప్రీమియం మొత్తాన్ని.. వారి జీతం నుండి నెలకు రూ. 390 చొప్పున మినహాయిస్తారు. మిగిలిన అదనపు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. పెన్షనర్లకు సంవత్సరానికి రూ. 7,728 ప్రీమియం మొత్తాన్ని.. వారి పెన్షన్ నుండి నెలకు రూ. 644 చొప్పున కట్ చేయనున్నారు.ఈ కొత్త స్కీమ్‌లో గరిష్ట చికిత్స పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 12 లక్షలకు పెంచారు.
ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు
ఈ బీమా పథకం మార్పులపై తమిళనాడు ప్రైమరీ స్కూల్ టీచర్స్ అలయన్స్ విరుదునగర్ జిల్లా కార్యదర్శి సెల్వగణేషన్ స్పందిస్తూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమిళనాడు వ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 11 లక్షల మంది పెన్షనర్ల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ప్రతి నెలా దాదాపు రూ. 128 కోట్ల వరకు మినహాయిస్తున్నారు. జూన్ 24న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం, ఉద్యోగుల నుండి వసూలు చేసే నెలవారీ ప్రీమియం మొత్తాన్ని రూ. 300 నుండి రూ. 390కి పెంచారన్నారు. గరిష్ట చికిత్స పరిమితిని రూ. 12 లక్షలకు పెంచినట్లు చెప్తున్నప్పటికీ.. ఏ ఏ చికిత్సలకు ఎంతెంత మొత్తం కేటాయించారనే వివరాలను జీవోలో స్పష్టంగా పేర్కొనలేదు.‘
కీలక చికిత్సలపై కోత
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వయసు రీత్యా ఎక్కువగా చేయించుకునే క్యాటరాక్ట్ (కంటి శుక్లాల సర్జరీ), హిస్టరెక్టమీ (గర్భాశయ తొలగింపు) వంటి కీలకమైన శస్త్రచికిత్సలను ఈ ఇన్సూరెన్స్ పరిధి నుండి పూర్తిగా తొలగించారని వివరించారు. దీంతో పాటు, ఈ స్కీమ్ పరిధిలోకి రాని ఆసుపత్రులలో అత్యవసర చికిత్స పొందితే లభించే రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని 75 శాతం నుండి 60 శాతానికి తగ్గించేశారన్నారు. గతంలో జీవోల్లో ఉండే ఉచిత వైద్యం అనే పదం, అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇన్సూరెన్స్ సంస్థల ఆధ్వర్యంలో జరగాల్సిన సమస్యల పరిష్కార వేదిక గురించిన ప్రస్తావనలు ఈ కొత్త ఉత్తర్వుల్లో ఎక్కడా లేవు అని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, కేరళ రాష్ట్రంలో ఉన్న తరహాలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని నేరుగా తన చేతుల్లోకి తీసుకుని, అన్ని ఆసుపత్రులలో పూర్తి ఉచిత వైద్యం అందించేలా నిర్ణయం తీసుకోవాలని సెల్వగణేషన్ డిమాండ్ చేశారు.


