ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు శ్రీకారం

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

● రెండు రోజుల పాటు ప్రక్రియ ● సి. మహేశ్వరికి అదనపు బాధ్యతలు

● రెండు రోజుల పాటు ప్రక్రియ

సాక్షి, చైన్నె : తమిళనాడులోని ప్రభుత్వ, ప్రభుత్వ పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ కౌన్సెలింగ్‌ సోమ, మంగళవారాలలో జరగనుంది. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం మొత్తం 2 లక్షల 36 వేల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తిస్తూ సాంకేతిక విద్యా శాఖ ఇప్పటికే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు

7.5శాతం కోటా

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం కేటాయించిన 7.5 శాతం ప్రత్యేక ప్రభుత్వ కోటా కింద మొత్తం 50,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులైన 46,604 మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. ఈ అభ్యర్థులకు సోమ, మంగళవారం ఆన్‌లైన్‌ విధానంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక, ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వివిధ కేటగిరీల కింద ఎంపిక చేసిన విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. ఇందులో దివ్యాంగుల కోటాలో 159 మంది విద్యార్థులు, క్రీడా కోటాలో 525 మంది విద్యార్థులు, మాజీ సైనికుల కోటాలో 14 మంది విద్యార్థులు ఉన్నారు.

జనరల్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: ప్రత్యేక కేటగిరీల కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత.. జనరల్‌ కేటగిరీ కింద వచ్చే స్పెషల్‌ రిజర్వేషన్‌ అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ నుండి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ మొత్తం 4 రోజుల పాటు కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. జూలై 20వ తేదీ నుండి సాధారణ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

16 నుంచి రాష్ట్రంలో

భారీగా ఉష్ణోగ్రతలు

కొరుక్కుపేట: తమిళనాడులో సోమవారం నుంచి 16వ తేదీ వరకు ఉష్ణోగ్రత సాధారణం కన్నా 7 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది వేసవి వర్షాలు లేకపోవడంతో తమిళనాడులో వడగాలులు ఇంకా తగ్గలేదు. కేవలం కొండ జిల్లాల్లో మాత్రమే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. జూలై ఆరంభం నుంచి చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. ఆ కాలంలో కోయంబత్తూరు, నీలగిరి, తెన్కాసి, తేని, కన్యా కుమారి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదైంది. చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు వంటి ఉత్తర జిల్లాల్లో సాయంత్రం వేళల్లో తేలికపాటి వర్షం మాత్రమే కురిసింది. అయితే, మిగతా సమయాల్లో మండుటెండల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షం ఎప్పుడు వస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏసీబీ డైరెక్టర్‌

అరుణ్‌ బదిలీ

సాక్షి, చైన్నె : తమిళనాడు పోలీస్‌ శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎ. అరుణ్‌ను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుత ఆ శాఖ ఐజీ సి. మహేశ్వరికి డైరెక్టర్‌ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ హోంశాఖ కార్యదర్శి మణివాసన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో సహా వివిధ శాఖల ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే, ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అప్పటివరకు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న చైన్నె మాజీ పోలీస్‌ కమిషనర్‌ ఎ. అరుణ్‌ను అత్యంత కీలకమైన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా సీఎం విజయ్‌ నియమించారు. అయితే, బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఆయనను మళ్లీ అకస్మాత్తుగా బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పోలీస్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక తాజా ఉత్తర్వుల ప్రకారం, బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారి ఎ. అరుణ్‌ ఇకపై ’తమిళనాడు పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌’గా బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే, కొత్త డైరెక్టర్‌ను నియమించేంత వరకు ఐజీ సి. మహేశ్వరి ఆ శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement