
సాక్షి, చైన్నె: చైన్నెలోని అభిమానుల్లో గుండె నిండా ఆనందాన్ని నింపి రెండు రోజుల పర్యటనను ముగించి శుక్రవారం బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. తన కోసం వచ్చిన అభిమానులందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారందరికి తనతో ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించారు. జగనన్నతో ఫొటోలు దిగామన్న సంబరంలో అభిమానులు మునిగారు.
కుటుంబ కార్యక్రమం నిమిత్తం రెండు రోజుల పర్యటనగా గురువారం సతీమణి వైఎస్ భారతీరెడ్డితో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చైన్నెకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజున బోట్‌క్లబ్ రోడ్డులోని ఇండియా సిమెంట్స్ చైర్మన్ శ్రీనివాసన్ నివాసానికి వెళ్లారు. ఇంజంబాక్కంలోని సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం తేనాంపేటలోని మురుగప్పా గ్రూప్స్ యాజమాన్యం నివాసంలో మరో సోదరుడు వైఎస్ సునీల్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడి నుంచి రాత్రి వైఎస్ అనిల్‌రెడ్డి నివాసానికి మళ్లీ వెళ్లారు. రాత్రి తొమ్మిదిన్నర, పది గంటల సమయంలో సైతం అభిమానులు, వైఎస్సార్‌సీపీ, వైఎస్సార్ సేవాదళ్ వర్గాలు తన కోసం రావడంతో వారందర్నీ పలకరించారు. వారందరికి ఫొటోలను దిగేందుకు అవకాశం కల్పించారు. జగనన్నతో ఫొటో దిగే అవకాశం రావడంతో అభిమానుల ఆందానికి అవధులు లేవు.
ఆనందోత్సాహం
శుక్రవారం ఉదయం సైతం పెద్ద సంఖ్యలో అభిమానులు వీజీపీ లేఔట్‌లోని అనిల్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. గంటన్నరకు పైగా అభిమానులు ఆ ఇంటి వద్ద జగనన్న కోసం ఎదురుచూశారు. తమ అభిమాన నేతను ఒక్క సారైనా చూసి వెళ్లేందుకు వచ్చిన వారందరికి ఆయనతో ఫొటోలు దిగే అవకాశం రావడంతో ఆనందానికి అవధులు లేవు. తన కోసం వచ్చిన వారందరినీ అప్యాయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు. యువతులు, మహిళలు, పిల్లలు, యువకులు తరలివచ్చి ఆనందంతో కేరింతలు కొట్టారు. వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్, కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృతికతోపాటు ఇతర నిర్వాహకులు తమ అధినేతను కలిశారు. మధ్యాహ్నం ఉత్తండి ప్రాంతంలోని సునీల్‌రెడ్డి నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అక్కడి నుంచి చైన్నె విమానాశ్రయానికి ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. వైఎస్ అనిల్‌రెడ్డితోపాటు సేవాదళ్ వర్గాలు అధినేతకు వీడ్కోలు పలికారు. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పూర్తిగా కుటుంబ కార్యక్రమం నిమిత్తం చైన్నెకు వచ్చినప్పటికీ, తమను పలకరించి ఆప్యాయతను చాటుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు ఆనందంతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.