
రోడ్లపై సంచరిస్తున్న పశువులను గోశాలకు అప్పగింత
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని నాలుగు జోన్‌లోను బస్టాండ్, మార్కెట్, కాయకూరల మార్కెట్, అన్నా రోడ్డు, ఆర్కాడు రోడ్డు,సత్‌వచ్చారి వంటి ప్రాంతాల్లో పశువులు, గేదెలు అధికంగా రోడ్డుపైనే తిరుగుతున్నాయి. అదే విధంగా పశువులు రోడ్డుపైనే పడుకోవడం, గొడవ పడి వాహన దారులపై పడి ప్రమాదానికి గురి చేయడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలకు, ట్రాఫిక్‌కు తరచూ అంతరాయం కల్పిస్తున్న పశువులను పట్టుకొని కాంచీపురం గోశాలకు అప్పగించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్ సలహాల మేరకు కార్పొరేషన్ అధికారులు, పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోడ్డుపై తిరుగుతున్న పశువులను మినీ లారీలో తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఇకపై పశువుల యజమానులు రోడ్డుపై పశువులను వదిలి పెడితే ఎటువంటి అపరాధ రుసం వసూలు చేయకుండా పశువులను స్వాధీనం చేసుకొని గోశాలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది వరకే పలుమార్లు పశువుల యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటూ అపరాధం విధించినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.