
అది తప్పే కాదు
తమిళసినిమా: బాలీవుడ్‌లో నటిగా పరిచయం అయినా టాలీవుడ్, కోలీవుడ్‌లో నటించే స్టార్ హీరోయిన్ అయిన నటి రకుల్ ప్రీత్ సింగ్. ముఖ్యంగా తెలుగులో తొలుత కుర్ర హీరోల సరసన నటించినా మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి టాప్‌హీరోలతో జత కట్టి తన స్టార్ డమ్‌ను తెచ్చుకున్న ఈ ఉత్తరాది బ్యూటీ తమిళంలోనూ కార్తీ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. ఈమె బ్యూటి గ్లామరస్ పాత్రలకే పరిమితం అయ్యాయని చెప్పవచ్చు. ఈమె తమిళంలో చివరిగా నటించిన చిత్రం ఇండియన్ –2. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత అవకాశాలు ముఖం చాటేశాయి. అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా హిందీలో ఒకటి ఒక్క చిత్రం ఈమె చేతిలో ఉంది. విజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకు తను గ్లామర్ నే ప్రామాణికంగా చేసుకున్నారు. తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీంతో పెళ్లి అయిన తరువాత కూడా అందాలార బోతతో రెచ్చిపోతున్నారనే విమర్శలను మూట కట్టుకుంటున్నారు. అయితే అలాంటి విమర్శలను ఈ అమ్మడు అస్సలు పట్టించుకోవడం లేదు.పైగా పెళ్లి అయిన తరువాత గ్లామరస్‌గా నటించకూడదా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి అనేది కథానాయికల ఎదుగుదలకు ఆటంకం కాదన్నారు. అందాలారబోత తప్పు కాదన్నారు. ఇంకా చెప్పాలంటే వివాహానంతరమే తనలో అందం, గ్లామర్ అధికం అయ్యాయన్నది తన ఫీలింగ్ అన్నారు. గ్లామర్‌ను జీవితంలో ఆస్వాదించాలని నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్