
క్లుప్తంగా
కొరుక్కుపేట: ప్లస్–2 పరీక్షలకు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ శశికళ వెల్లడించారు. ఈ మేరకు ఆమె జిల్లా ప్రాథమిక విద్యా అధికారులకు పంపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ప్లస్ –2 పబ్లిక్ పరీక్షకు కొత్త కేంద్రాలకు అవకాశం ఇవ్వనున్నారు. ఈమేరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన పాఠశాలలను వ్యక్తిగతంగా తనిఖీ చేసిన తర్వాత, దానికి గల కారణాలను పేర్కొంటూ సిఫార్సు చేయాలి అని అధికారులకు సూచించారు.
సాక్షి, చైన్నె: అలుమ్నీ డే 2025 వేడులకు రామకృష్ణ మిషన్ ఆశ్రమ పాఠశాలల పూర్వ విద్యార్థుల సంఘం సన్నద్ధమైంది. టీ నగర్‌లోని బజుల్లా రోడ్డులోని శ్రీరామకృష్ణ మిషన్ బాయ్స్ స్కూల్‌లోని ఇన్ఫోసిస్ హాల్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వేడుకలు నిర్వహించనున్నారు. సుమారు 1000 మందికి పైగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక చోట ఈ వేడుక ద్వారా ఏకం కానున్నారు. రిజర్వుర్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి, ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సుందర్‌జీ, ఐఎఎస్ అధికారి పీ శంకర్, టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్, ప్రముఖులు ఆర్‌ఎస్ మనోహర్, పద్మ భూషన్ నల్లి కుప్పు స్వామి చెట్టిలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కాగా, ఈ పాఠశాల 1930 నుంచి చైన్నెలో విద్యా, సాంస్కృతిక నిర్మాణంలో భాగమై ఉన్నది. పనగల్ పార్క్‌లో మొదటి పాఠశాలగా ఇది అప్పట్లో పేరు గడించడం విశేషం.
తిరువొత్తియూరు: చైన్నెలోని ఐనావరం, కరియమాణికం పిళ్లై వీధికి చెందిన శివ (33) మెట్రో వాటర్ ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని అన్న బాబు (35). ఇతను అరుంబాక్కం, జై నగర్ 6వ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మీనా, కొడుకు, కూతురు ఉన్నారు. గత రెండున్నర సంవత్సరాల క్రితం బాబుతో ఏర్పడిన విభేదాల కారణంగా అతని భార్య మీనా విడి పోయింది. అప్పటి నుండి తన తమ్ముడు శివాతో కలిసి బాబు ఉంటున్నాడు. బాబు మద్యం తాగుతూ గొడవ చేస్తున్నట్టు తెలిసింది. దీనిని తమ్ముడు శివ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, గురువారం ఉదయం తమ్ముడు శివ తన అన్నయ్య బాబును కత్తితో పొడిచి, ఇంటి తలుపు వేసి బయటకు వెళ్లిపోయాడు. పక్కింటి వారు గుర్తించి పోలీసులు చెప్పడంతో తమ్ముడు శివను అరెస్టు చేశారు.
తమిళసినిమా: గత 1990లో వైదేహి వందాచ్చు చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత, పొండాట్టి రాజ్యం, అభిరామి, మామియార్ విడు మొదలగు పలు చిత్రాల్లో నటించిన నటుడు శరవణన్. ఆ తరువాత క్యారెక్టర్‌గా పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. కాగా 2003లో సూర్యశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 2015 నుంచి సహజీవనం సాగిస్తున్న శ్రీదేవి అనే యువతిని నటుడు సరవణన్ 2018 రెండో వివాహం చేసుకున్నారు. కాగా వీరు స్థానిక మాంగాడు సమీపంలోని మౌలివాక్కంలో ఒక భవనం పై అంతస్తులో శరవణన్ మొదటి భార్య కింద భాగంలో రెండో భార్యతో శరవణన్ కలిసి నివసిస్తున్నారు. కాగా బుధవారం ఆవడి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు శాఖ ప్రజాసమస్యల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న నటుడు శరవణన్ మొదటి భార్య తన భర్తపై హత్యా బెదిరింపు ఫిర్యాదు చేశారు. అందులో తాను శరవణన్ 1996 నుంచి 2003 వరకు సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. అప్పట్లో తాను కస్టమ్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేదానినని దీంతో పలుమార్లు తాను ఆర్థికంగా శరవణన్‌ను ఆదుకున్నానని చెప్పారు. అలాంటిది ఆయన తనకు ఇప్పుడు అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. రెండో పెళ్లి చేసుకున్న శరవణన్ ఆమెతో కలిసి తనకు హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారని ఆరోపించారు. ఇదేవిధంగా తనకు జీవన భరణిగా రూ. 40 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిరువొత్తియూరు: గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచ్చి జిల్లామేలూరు, అసగత్తూరు ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని, కొందరు నకిలీ వైద్యులు గ్రామాల్లోని మహిళల వద్ద గర్భంలో ఉన్న శిశువు మగనా, ఆడదా అని స్కాన్ పరికరం ద్వారా చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీని పై సమచారం అందుకున్న కళ్లకురిచ్చి జిల్లా ఆరోగ్య అధికారి రాజా ఆధ్వర్యంలో వైద్య బృందం ఆ ప్రాంతంలో పర్యవేక్షించింది. అలాగే సేలం జిల్లా జాయింట్ డైరెక్టర్ నందిని నేతృత్వంలోని వైద్య బృందం సెంబక్కురిచ్చికి వెళ్లి నకిలీ డాక్టర్లు అయిన కడలూరు జిల్లా శిరుపాక్కంకు చెందిన ఇళయరాజా (36), కళ్లకురిచ్చి జిల్లా అశగలత్తూరుకు చెందిన మణివణ్ణన్ (36)ను అరెస్టు చేశారు.