ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు | - | Sakshi
Sakshi News home page

ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు

Sep 5 2025 5:38 AM | Updated on Sep 5 2025 5:38 AM

ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు

ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు

తమిళసినిమా: లోకా చాప్టర్‌– 1 ఇంత పెద్ద విషయాన్ని సాధిస్తుందని ఊహించలేదు అని నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈయన వేఫారర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం లోకా . చాప్టర్‌ –1. సూపర్‌ హీరో ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో నటి కల్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రను పోషించించారు. ప్రేమలు చిత్రం ఫేమ్‌ నస్రీన్‌ కె.గపూర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. డోమినిక్‌ అరుణ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం గత వారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ విడుదల చేసింది. కాగా లోకా చాప్టర్‌– 1 చిత్రం తొలి 7 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసి ఘన విజయం వైపు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ యాక్షన్‌ హీరోగా నటించనున్నట్లు తన తండ్రి ప్రియదర్శన్‌ కు చెప్పగా నువ్వా యాక్షన్‌ హీరో పాత్రలోనా అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత ఏదో చెయ్యి. కాళ్లు, చేతులు విరగ కొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు. రూ. 100 కోట్లు వసూళ్లు సాధించిన తొలి సూపర్‌ హీరో కథా చిత్రంగా నమోదు కావడంపై స్పందించిన కల్యాణి ప్రియదర్శన్‌ ఇది చిత్ర యూనిట్‌ సమష్టి విజయం అని ఆమె పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత, నటుడు దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ యామీ చిత్రాన్ని ఆర్గానిక్‌ గానే చేశామన్నారు. అయితే ఇంత విజయం సాధిస్తుందని ఊహించలేదు అన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్‌ను అనుకున్నామని, సూపర్‌ హీరోగా ఆమె చాలా బాగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. తాను మలయాళంలో, తెలుగులో నటించిన చిత్రాలు తమిళ అనువాదం విడుదలైనా తమిళ ప్రేక్షకులకు అమాంతంగా ఆదరిస్తున్నారని అందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసిన ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కు ధన్యవాదాలు అన్నారు.తమ కొలాబరేషన్‌ కొనసాగుతుందని, తదుపరి కాంత చిత్రం రానుందని దుల్కర్‌ సల్మాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement