‘ఆరోగ్యం’ హరీ! | Chandrababu coalition govt Privatization Public Health, Medical Colleges | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యం’ హరీ!

Sep 5 2025 5:08 AM | Updated on Sep 5 2025 7:26 AM

Chandrababu coalition govt Privatization Public Health, Medical Colleges

వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మించిన పులివెందుల మెడికల్‌ కాలేజీ

అటు ప్రజారోగ్యం.. ఇటు వైద్య కాలేజీలు ఇక ‘ప్రైవేట్‌’ చేతుల్లోకే  

దేశ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ  

కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న రాష్ట్రాలు 

మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్నవాటిని అడ్డుకుని ప్రైవేట్‌పరం 

వైఎస్‌ జగన్‌ తెచ్చిన కొత్త కాలేజీలను కుట్రపూరితంగా అడ్డుకుంటున్న బాబు సర్కారు 

దీంతో మెడికల్‌ సీట్లు పోవడంతోపాటు నాణ్యమైన వైద్యం పేదలకు దూరం 

మోసపూరిత చర్యలు, తిరోగమన విధానాలతో అంతా స్కామ్‌ల మయం.. 

సంపద సృష్టి అంటే స్కామ్‌లు.. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేట్‌కు దోచిపెట్టి కమీషన్లు కాజేయటమేనా? అంటున్న వైద్య నిపుణులు, రాజకీయ పరిశీలకులు 

అపర సంజీవని ఆరోగ్యశ్రీ.. బీమా పద్ధతిలో అమలు.. దేశంలోనే అత్యుత్తమంగా అమలైన విధానానికి బాబు సర్కారు ఉరి! 

బీమా కంపెనీల ప్రధాన లక్ష్యం ప్రీమియం మిగుల్చుకోవటమే.. బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకొచ్చిన పలు రాష్ట్రాలు

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త కాలేజీల్లో మెరుగైన నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు నాడు నారా లోకేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి వంత పాడే ‘ఈనాడు’.. వైద్య విద్యనూ అమ్మేశారు.. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్‌.. అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని రద్దు చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కి ఇప్పుడు ఏకంగా వైద్య కళాశాలలనే అమ్మకానికి పెట్టేశారు!!

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 10 కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి ఏపీ కేబినెట్‌ ఇప్పుడు వేదికైంది! ఏ ప్రభుత్వమైనా పోరాడి మరీ మెడికల్‌ కాలేజీలను సాధించుకుంటుంది. అలాంటిది అన్ని హంగులతో సిద్ధమైన వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేస్తుండటంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కృషితో సాకారమైన మెడికల్‌ కాలే­జీలను కక్షపూరితంగా అడ్డుకుని పేద విద్యా­ర్థులకు వైద్య విద్యను దూరం చేస్తుండటాన్ని తప్పుబ­డుతు­న్నారు. 

కూటమి సర్కా­రు అనాలోచిత చర్యలతో మన రాష్ట్రం మెడికల్‌ సీట్లను కోల్పోవడంతోపాటు నాణ్యమైన వైద్యం పేద­లకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తు­న్నారు. ప్రతి జిల్లాకు ఒక  మెడికల్‌ కాలేజీ ఉంటే టీచింగ్‌ ఆస్పత్రి ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలా నిర్వహించడం ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పోటీత­త్వం పెరిగి రేట్లు తగ్గుతాయి. 

నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ప్రజలకు వైద్యం భారం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మెడికల్‌ సీట్లు కోల్పోవడమంటే పేదలకు నాణ్యమైన వైద్యం దూర­మైనట్లే! ఇక ప్రజల ఆరోగ్యంతోనూ చంద్రబాబు సర్కారు ఆటలాడుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన కూటమి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చొప్పున 15 నెలల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.4,500 కోట్లు బిల్లులు బకాయిలు పెట్టడం, ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టడంతో వైద్య సేవలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. 

బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్‌ ఆస్ప­త్రులు రోగులను చేర్చుకోవడం లేదు. ఇక 108, 104 వాహనాల పరి­స్థితి దారుణంగా ఉంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించి ప్రజారోగ్యానికి భరోసా కల్పించగా కూటమి సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తూ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటు కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తూ.. అటు ఆరోగ్యశ్రీని బీమా కంపెనీ చేతుల్లో పెట్టి వైద్య రంగాన్ని స్కామ్‌ల మయంగా మారుస్తోంది. 

సంపద సృష్టి అంటే.. స్కామ్‌లు చేయడం.. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేట్‌కి దోచిపెట్టి కమీషన్ల రూపంలో డబ్బులు వసూలు చేసుకోవటమా? అని వైద్య రంగ నిపు­ణులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1992 నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీలకు అనుమతించడంలో అవకతవకలు జరిగినట్లు వెలుగు­లోకి రావడంతో న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. 

అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ రంగంలో అన్ని సదు­పాయాలతో సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్‌ చేతుల్లో పెడుతూ స్కామ్‌లకు తెర తీస్తున్నారని పేర్కొంటు­న్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అన్నీ ప్రభుత్వ పరి­ధిలో నడిచేలా ఏకంగా 17 కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. అదే ప్రణాళిక ప్రకారం అవన్నీ అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో చేతి నుంచి రూపాయి ఖర్చు చేసే పని లేకుండా పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అయ్యేవి. అలాంటిది పీపీపీ పేరిట చంద్రబాబు సర్కారు 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతోంది. 

దీంతో ఆయా కళాశాలలపై 63 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హక్కులు ఉంటాయి. వారి ఆధీనంలోనే బోధనాస్ప­త్రులు నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం కాదు. డబ్బులు చెల్లించి ప్రజలు సేవలు పొందాల్సి ఉంటుంది. ఓవైపు ఆరోగ్యశ్రీ సేవలు బీమా రూపంలో ఎండమావిగా మారుస్తున్నారు. మరోవైపు వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు. దీంతో దురదృష్టవశాత్తూ జబ్బుల బారిన పడితే పేదల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం నెలకొంది. 


పేదలకు ఉచిత వైద్యం కలే! 
ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంతో పాటు ఆరోగ్యశ్రీలో బీమా విధానం అమలుకు పచ్చజెండా ఊపడం ద్వారా 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ భరోసా కల్పించిన దేశంలోనే అత్యుత్తమ పథకానికి కూటమి సర్కారు ఉరి బిగించింది. బీమా కంపెనీలు చెల్లించిన ప్రీమియంలో వీలైనంత ఎక్కువ లాభం పొందేలా లెక్కలేనన్ని కొర్రీలు వేసి చికిత్సలకు అనుమతులు, క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంటాయి. 

ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీఏఐ) ప్రకారం దేశంలో 20 ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీలు నమోదైన క్లెయిమ్‌ల మొత్తంలో 55 నుంచి 80 శాతం మేర మాత్రమే చెల్లిస్తున్నాయి. దీన్నిబట్టే ఆరోగ్య శ్రీలో బీమా విధానం ప్రవేశపెడితే ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇలాంటి వ్యవస్థలను ప్రభుత్వ ఆరోగ్య రంగంలోకి చొప్పిస్తే పేదలకు ఉచిత వైద్యం కలేనని నిపుణులు పేర్కొంటున్నారు. 



చంద్రబాబు ప్రభుత్వం రూ.2.5 లక్షల వరకు చికిత్సలను మాత్రమే బీమా రూపంలో అందించనుంది. అంతకంటే ఎక్కువ ఖర్చయితే ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని చెబుతున్నారు. అంటే బీమా కంపెనీ దయాదాక్షిణ్యాల ఆధారంగానే ప్రజలకు చికిత్సలు అందుతాయన్నమాట.  


‘ఆసరా’ ఎగరగొట్టి... 
ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తుకొచ్చేది మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలి పీఠం ఎక్కిస్తుండటం నివ్వెరపరుస్తోంది. గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా వాటి యాజమాన్యాలు సేవలు నిలిపేసి సమ్మెకు దిగేలా చేసింది. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ సాయాన్ని నిలిపేశారు.   

బీ‘మాయ’ వద్దంటూ... 
దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్‌ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది. యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే జన్‌ ఆరోగ్య యోజన (ఎంజేపీజేఏవై)ను తొలుత అమలు చేసింది. దీనికింద 95.47 లక్షల కుటుంబాలకు రూ.లక్షన్నర బీమా కవరేజీ ఉండేది. 

కానీ, ఆస్పత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో రూ.3 వేల కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్‌ హెల్త్‌ అష్యూరెన్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్‌విధానంలోకి మారాలని రాజస్థాన్‌ ప్రభుత్వం యోచిస్తోంది.  
 
చికిత్సల్లో జాప్యం.. 
ప్రజల ప్రయోజనాలను కాలరాస్తూ బీమా వైపే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రస్తుతం హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీ అమలు చేస్తుండగా కొత్త విధానంలో రాష్ట్రంలోని జిల్లాలను రెండు భాగాలుగా చేసి రెండు క్లస్టర్లుగా కుటుంబాలు/లబ్ధిదారుల వారీగా ప్రీమియం చెల్లించనుంది. అంటే ప్రభుత్వ నిధులను మళ్లీ మధ్యవర్తి చేతిలో పెడుతున్నారు. ఇవన్నీ చెల్లించిన ప్రీమియంలో ఎక్కువ మిగుల్చుకుని తక్కువ ఖర్చు చేయడమే పరమావధిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఆస్పత్రుల నుంచి  చికిత్సల అభ్యర్థనలను రకరకాల కారణాలు చూపి తిరస్కరిస్తాయి. 

రోగులకు వైద్యం అందడంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ప్రస్తుత విధానంలో ట్రస్ట్‌ పర్యవేక్షణలో ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్‌ సీఈవోకు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకునే అధికారం ఉంది. బీమా పద్ధతిలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదు. బీమా కంపెనీ చెప్పుచేతల్లోకి ఆస్పత్రులు వెళతాయి. ఆ కంపెనీ నియమ నిబంధనల ప్రకారమే వైద్యం అందిస్తాయి.  

ఆరోగ్యశ్రీతో వైఎస్‌ జగన్‌ ఆపన్నహస్తం
పేద, మధ్య తరగతి ప్రజలు గుండె, మెదడు, కాలేయ, కేన్సర్‌ వంటి ఎంత పెద్ద జబ్బు బారినపడినా చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టనివ్వకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన ఈ పథకం బలోపేతానికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. 2019 ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు వైఎస్‌ జగన్‌. 2019కి ముందు వెయ్యి లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉండగా  ఏకంగా 2,371 ఆస్పత్రులకు విస్తరించారు. చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు.  

టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను వైఎస్‌ జగన్‌ ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించారు. రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. శస్త్రచికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకు పైగా సాయం చేశారు. 

ఇక దేశంలోనే తొలిసారిగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి మహమ్మారి విజృంభణ వేళ ప్రజలకు కొండంత భరోసా కల్పించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.25 లక్షల వరకూ చికిత్సలను ప్రజలు పూర్తి ఉచితంగా పొందే వీలు కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని మధ్య తరగతి కుటుంబాలకు సైతం ఆరోగ్య భద్రత కల్పించారని నీతి ఆయోగ్‌ సైతం ప్రశంసించింది.

వైద్య విద్య ‘ప్రైవేట్‌’ పరం
వాస్తవానికి గత విద్యా సంవత్సరమే పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని మెడికల్‌ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం కుట్రపూరితంగా పులివెందులకు మంజూరైన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. గతేడాది నిలిచిన నాలుగు కళాశాలలకు అనుమతులు ఈ దఫా అయినా వస్తాయని, ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించారు. 

విద్యార్థుల భవి­ష్యత్, పేదల ఆరోగ్యం ఏమైపోతే మాకేంటన్నట్టుగా ‘పీపీపీ విధానంపై  ముందుకే వెళ్లాలి’ అని నిర్ణయించిన ప్రభుత్వం కళాశాలలకు అనుమతుల దరఖాస్తు సమర్పించనేలేదు. గత విద్యా సంవత్సరం ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా, కూటమి ప్రభు­త్వం కక్షపూరిత విధానాలతో కేవలం 50 సీట్లతో పాడేరు వైద్య కళాశాలకు మాత్రమే అనుమతులు దక్కాయి. దీంతో 700 ఎంబీబీఎస్‌ సీట్లు గతేడాది మన విద్యార్థులు నష్టపో­యారు. 

ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–­26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే, వైద్య కళాశాలల నిర్మాణాలన్నింటినీ గద్దెనెక్కిన రోజు నుంచే చంద్రబాబు నిలిపివేయించారు. 

గతేడాది ప్రారంభానికి నోచుకోని 4 కళాశాలలతో­పాటు, ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఏడింటిలో ఏ ఒక్క కళాశాలకు అనుమతుల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయలేదు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చిది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement