
ఉచిత ఇసుక ముసుగులో పరాకాష్టకు చేరిన కూటమి పెద్దల దోపిడీ
ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు.. ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడా లేదు
ఈ దందాను కప్పిపుచ్చుకోవడానికి విష ప్రచారానికి దిగిన బాబు సర్కారు
జేపీ వెంచర్స్ రూ.18 కోట్ల డిపాజిట్‌పై దుష్ప్రచారం.. వాస్తవానికి గత చంద్రబాబు సర్కారుకే రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్‌జీటీ
నాడు, నేడు చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో అక్రమ తవ్వకాలు
రాష్ట్రంలో పేరుకే ఉచిత ఇసుక.. జనం మాత్రం డబ్బు కట్టాల్సిందే
ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లకు సైతం ఉచితంగా ఇవ్వని వైనం
అధికారంలోకి రాగానే 80 లక్షల టన్నుల ఇసుక నిల్వను అమ్మేసుకున్న టీడీపీ నేతలు..
వైఎస్సార్‌సీపీ హయాంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువ
వైఎస్ జగన్ హయాంలో ఇసుకపై ఏటా రూ.750 కోట్ల ఆదాయం
ఉచితం ముసుగులో అడుగడుగునా ఉల్లంఘనలు.. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా కూటమి పార్టీల నేతల జేబులు మాత్రం నిండుతున్నాయి.. మరోవైపు రెట్టింపు ధర చెల్లించి ప్రజలు ఇసుకను కొనుక్కోవాల్సి వస్తోంది.. కాదు, కూడదంటే ఎదురు దాడి.. వేధింపులు.. తప్పుడు కేసులు.. రాష్ట్రంలో ఇసుక విషయంలో జరుగుతున్నది ఇదే.
ఈ విషయం ప్రజల్లో చర్చకు వస్తుండటంతో ఎప్పటిలాగే తమదైన శైలిలో కూటమి ప్రభుత్వ పెద్దలు విష ప్రచారానికి తెర లేపారు. దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లు రూ.100 కోట్ల జరిమానా సంగతి కప్పిపుచ్చుకోవడానికి కుప్పిగంతులేస్తున్నారు. ఇసుక ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారో చెప్పండన్న ప్రజల ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.
సాక్షి, అమరావతి: ఉచితం ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగింది. వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎక్కడికక్కడ దోచేస్తూ మూడు జేసీబీలు.. ముప్పై టిప్పర్లుగా దందాను కొనసాగిస్తూ గతంలో అక్రమాలు జరిగాయంటూ విష ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా ఇసుక లభించక పోయినా, ప్రభుత్వానికి ఏమాత్రం ఆదాయం రాకపోయినా తన దందాను సమర్థించుకుంటోంది.
పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ).. జేపీ వెంచర్స్ తమ వద్ద రూ.18 కోట్లు ఉంచాలని చెప్పిన విషయాన్ని చిలవలు పలువలుగా వక్రీకరించి జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం జరిగాయి. నాటి సీఎం చంద్రబాబు నివాసం వెనక భాగంలో కృష్ణా నదిని కొల్లగొట్టి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్‌జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ధృవీకరించింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించడం తెలిసిందే.
నాడు అక్రమ తవ్వకాలను బయటపెటి్టన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా
అప్పట్లో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నాయని, వాటిని వెంటనే నివారించాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ఎన్‌జీటీలో పిటీషన్ వేశారంటే ఇసుక అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో స్పష్టమవుతోంది. ఆయన స్వయంగా ఇక్కడ పర్యటించి అక్రమాలను కళ్లారా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కృష్ణా నది ప్రమాదంలో పడిందని ఆ తర్వాత ఎన్‌జీటీలో స్వయంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. స్థానిక పర్యావరణ వేత్త అనుమోలు గాంధీ ఇంకా పలువురు కూడా సీఎం చంద్రబాబు నివాసం వెనుక వెంకటపాలెం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల కృష్ణా నది ప్రమాదకరంగా మారిందని పిటీషన్లు వేశారు.
అక్రమ తవ్వకాలు నిర్ధారణ
కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఎన్‌జీటీ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఉండవల్లి కరకట్టతోపాటు పలు ప్రాంతాలను పరిశీలించి, ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. చంద్రబాబు నివాసం పక్కనే కృష్ణా నది కరకట్టపై నుంచి నదిలోకి వెళ్లి నదీ గర్భంలో 25 మీటర్ల లోతుకు భారీ యంత్రాలతో తవ్వి ఇసుకను తీస్తున్నారని స్పష్టం చేసింది.
డ్రెడ్జింగ్ ముసుగులో నిషేధించిన భారీ డ్రెడ్జర్లు, పొక్లెయిన్‌లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల నది కోర్సు ప్రమాదభరితంగా మారిందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అక్రమంగా తవ్విన ఇసుక నిత్యం 2,500 ట్రక్కుల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతోందన్న పిటీషనర్ల వాదన నిజమేనని తేల్చింది. 25 టన్నుల సామర్థ్యం గల ట్రక్కులో 40 టన్నుల ఇసుకను లోడ్ చేసి అమ్ముకుంటున్నారని స్పష్టం చేసింది.
ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా వేయాలని కమిటీ సూచించడంతో ఎన్‌జీటీ న్యాయమూర్తి రూ.100 కోట్ల జరిమానా విధించారు. ఎన్‌జీటీ జరిమానా వేసిన కొద్ది రోజులు తవ్వకాలు ఆగినా, మళ్లీ యథావిధిగా ఇసుక తవ్వకాలు సాగించి దందా కొనసాగించారు.
వైఎస్ జగన్ హయాంలో పారదర్శక విధానం.. ప్రభుత్వానికి ఆదాయం
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇసుక అక్రమాలను నిరోధించేందుకు పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి.
ఉచితం మాటున అడ్డగోలు దోపిడీ
ప్రస్తుతం ఉచితం మాటునే ఇసుక అమ్మకాలు జరుగుతుండగా, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఇసుక దోపిడీ అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు. అదేమంటే ఇది ఉచిత ఇసుక విధానం, డబ్బు కడితేనే ఉచిత ఇసుక ఇస్తామని చెబుతున్నారు.
ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఇసుకను స్థానికులు ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పినా, టీడీపీ నేతలు అసలు ఎవరినీ రీచ్ దగ్గరకే రానీయడం లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలు కంటే కూడా అధిక ధరకు అమ్ముతుండడం గమనార్హం. విజయవాడలో 22 టన్నుల లారీ ఇసుక రూ.40 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారు.
కూటమి ప్రభుత్వ రాకతో మళ్లీ అక్రమాలు
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా రీచ్‌ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆయా ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్ముకున్నారు.
అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్‌లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.
రూ.100 కోట్ల జరిమానా విధించిన చోటే మళ్లీ అక్రమ తవ్వకాలు
2019 ఏప్రిల్‌లో చంద్రబాబు హయాంలో ఆయన ఇంటి వెనుక భాగంలో కృష్ణా నదిలో అక్రమాలకు పాల్పడినట్లు ఎన్‌జీటీ నిర్ధారించి, జరిమానా విధించిన చోటే ప్రస్తుతం అదే రీతిలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి. బల్లకట్టు నావిగేషన్ ఛానల్ ముసుగులో డ్రెడ్జింగ్ చేస్తూ అప్పటి మాదిరిగానే ఒక అనామక సంస్థకు టెండర్ కట్టబెట్టి చినబాబు మనుషులు నిత్యం వేలాది టన్నుల ఇసుకను కరకట్ట మీదుగా భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. రూ.వందల కోట్ల ఇసుకను తవ్వి అమ్మేసుకుంటున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. అదేమంటే అంతా సక్రమంగానే జరుగుతున్నట్లు గనుల శాఖ దబాయిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా అదే దందా
ూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక ముసుగులో అక్రమాల పర్వం యథేచ్చగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారం సాగిస్తున్నారు.
» గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా అనుమతి లేని రీచ్‌ల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సి ఉండగా ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుక రూ.30 వేల నుంచి 60 వేల వరకు అమ్ముతున్నారు.
» ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం జిల్లా సరిహద్దు నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్ని చోట్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు చినబాబుకు ఠంఛనుగా చేరిపోతున్నాయి. చినబాబుకు కప్పం కట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను కప్పిపుచ్చేందుకే జేపీ వెంచర్స్‌కు ఎన్‌జీటీ జరిమానా విధించిందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు.