
2024–25లో భారీగా తగ్గిన విద్యార్థుల చేరికలు
2023–24తో పోలిస్తే 2024–25లో 2.87 లక్షలు తగ్గిన అడ్మిషన్లు
వైఎస్ జగన్ హయాంలో ఏటా పెరిగిన చేరికలు
దేశంలో పిల్లలు–2025 నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పిల్లల చదువులు తిరోగమనం బాట పట్టాయి. వైఎస్ జగన్ పాలనా కాలంతో పోలిస్తే బాబు పాలనలోని 2024–25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లలు సంఖ్య ఏకంగా 2,87,068 మంది తగ్గింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
వైఎస్ జగన్ హయాంలో 2022–23 విద్యా సంవత్సరంతో పోలిస్తే.. 2023–24 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. అందుకు భిన్నంగా 2024–25 విద్యా సంవత్సరంలో చంద్రబాబు పాలనలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. సాధారణంగా ఏటా చదువుకునే పిల్లల సంఖ్య పెరగాలి. అందుకు విరుద్ధంగా 2024–25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయిందంటే పిల్లల చదువులను చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా నిరక్ష్యం చేస్తోందో స్పష్టమవుతోంది.
తగ్గిన 2.87 లక్షల విద్యార్థులు
2023–24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024–25 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుకునే విద్యార్థులు 2,87,068 మంది తగ్గారు. వీరిలో బాలుర సంఖ్య 1,84,096 కాగా.. బాలికల సంఖ్య 1,02,972గా ఉంది. మరోపక్క పిల్లల డ్రాప్ అవుట్స్ కూడా 2023–24తో పోల్చితే 2024–25లో పెరిగిపోయాయి. సాధారణంగా ఏటా డ్రాప్ అవుట్లు తగ్గాలి. అందుకు భిన్నంగా 2024–25 బాబు పాలనలో డ్రాప్ అవుట్లు పెరిగారు.
9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 2023–24 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్స్ 10.1 శాతం ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024–25 విద్యా సంవత్సరంలో 11.2 శాతానికి పెరిగింది. అలాగే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2023–24 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 1.1 శాతం ఉండగా.. 2024–25 విద్యా సంవత్సరంలో 3.7 శాతానికి పెరిగింది. 2023–24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ 1.2 శాతం ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో 2.2 శాతానికి పెరిగింది.