
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి
రిటైర్ అయ్యాక డీఏ బకాయిలిస్తామనడం దుర్మార్గం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఇవ్వాల్సిన నాలుగు డీఏల్లో ఒకటి మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ అయ్యాకే ఇస్తామని జీవోలు జారీ చేయడం దుర్మార్గమని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. డీఏపై గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి జీవోలు విడుదల చేయలేదని, ఇది ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోసపూరిత జీవో ఇచ్చి పండుగ నాడు ఉద్యోగులను ఆవేదనలో ముంచేశారని విమర్శించారు. రిటైర్ అయ్యాక డీఏ బకాయిలు ఇస్తే ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. 30 ఏళ్లు సర్వీసు చేసిన ఉద్యోగికి రిటైర్ అయ్యాక కొద్ది మొత్తం ఇస్తే ఏం ఉపయోగమని ప్రశ్నించారు.
ఇది చాలా చెడు సంప్రదాయమని, దీన్ని మార్చకుంటే భవిష్యత్తులోనూ ఇలాగే వ్యవహరించే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తంచేశారు. 16 నెలల వరకు ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడకుండా హడావుడిగా సీఎం వద్ద సమావేశం నిర్వహించి ఒక డీఏ ప్రకటించడమే విడ్డూరమైతే, ఇప్పుడు దానిపైనా పెద్ద బాంబు పేల్చారన్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు అసలు ఏం అడిగారో తెలియడం లేదన్నారు. పీఆర్సీ, ఐఆర్ గురించి అడగకుంటే అంత పెద్ద స్థాయిలో సమావేశం నిర్వహించి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
ఆ సమావేశంలో పీఆర్సీ ఇచ్చేది లేదని సీఎం అన్నట్లు తెలిసిందన్నారు. పీఆర్సీ ఇస్తే ఐఆర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, పీఆర్సీ ఇవ్వలేమని చెప్పినట్లు తెలిసిందన్నారు. దీనిపై సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. సీఎం దగ్గర వారు ప్రస్తావించిన అంశాలు, సీఎం చెప్పిన విషయాలు ఉద్యోగులకు తెలియాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఒక్క డీఏ ఇవ్వడానికే ఇన్ని ఇబ్బందులు పెడితే ఇక రూ.34 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? పీఆర్సీ, ఐఆర్ సంగతి ఏమిటి? అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.