
దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటులా చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ
ఇవ్వాల్సింది నాలుగు డీఏలు.. చివరకు ఇచ్చింది ఒక్కటి.. అందులోనూ మోసమే
21 నెలల డీఏ బకాయిలు పదవీ విరమణ తరువాతే చెల్లిస్తామంటూ తొలుత మెలిక..
పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపుల్లోనూ పితలాటకమే.. 16 నెలలుగా డ్రామాలు
ఐఆర్ లేదు.. పీఆర్సీ ఊసే లేదు.. చివరకూ డీఏలోనూ మోసమే..
ఇలాంటి వింత జీవోలు చరిత్రలో ఇదే తొలిసారి.. భగ్గుమన్న ఉద్యోగ వర్గాలు
కూటమి సర్కారు మోసంపై రగిలిపోతున్న ఉద్యోగులు, పెన్షనర్లు
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తీవ్ర విమర్శల నేపథ్యంలో చివరకు సవరణ జీవోలు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కారు ఒకే ఒక్క డీఏకి పరిమితం చేసి పండుగ పూట తీవ్ర నిరాశకు గురి చేయగా.. చివరకు అందులోనూ మెలిక పెట్టి ఉద్యోగులు, పెన్షనర్లకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క డీఏ.. అది కూడా 21 నెలల బకాయిలను పదవీ విరమణ లేదా వీఆర్‌ఎస్ తరువాతే ఇస్తామని తొలుత బాంబు పేల్చిన సర్కారు.. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో అనంతరం సర్దుకుని మరో రెండు సవరణ జీవోలిచ్చింది. వీటిలోనూ మరికొన్ని మెలికలు పెట్టింది. డీఏల జీవోలపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
కూటమి సర్కారు దొంగాటతో తాము ఏమాత్రం ఏమారినా దారుణంగా మోసపోయే పరిస్థితి నెలకొందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రభుత్వం నాలుగు డీఏలను 16 నెలలుగా పెండింగ్‌లో పెట్టిందని, చివరకు ఒకే ఒక్క డీఏ ఇస్తామంటూ అందులోనూ మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన 9 ప్రధాన హామీలను విస్మరించి దారుణంగా వంచిస్తోందని, పీఆర్సీ కమిషనర్‌ను నియమించకపోగా గతంలో ఉన్నవారిని సైతం తొలగించిందని పేర్కొంటున్నారు. ఇక ఐఆర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెలుగులు లేవు.. కారు చీకట్లే!
వెలుగుల పండుగ దీపావళి నాడు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో కారు చీకట్లు నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తొలుత రెండు చీకటి జీవోలు 60, 61 జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా నాలుగు డీఏలకుగానూ ఒక డీఏ మంజూరు చేస్తున్నామని, ఉద్యోగులు, పెన్షనర్లు పండుగ చేసుకోండంటూ చెప్పుకొచ్చారు.
అయితే దీపావళికి ముందు రోజు ఆదివారం అర్ధరాత్రి డీఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఆ రెండు చీకటి జీవోలను చూసి ఉద్యోగులు, పెన్షనర్లకు నోట మాట రాలేదు. ఉద్యోగులకు గతేడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం మంజూరు చేస్తున్నట్లు జీవో 60లో ఆర్థిక శాఖ పేర్కొంది. 21 నెలల డీఏ బకాయిలను (01–01–2024 నుంచి 30–09–2025 వరకు) ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్‌ఎస్ సమయంలో చెల్లిస్తామని జీవోలో స్పష్టం చేసింది. ఇలాంటి జీవోను దేశ చరిత్రలో ఎప్పుడు జారీ చేయలేదని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి.
చరిత్రలో ఎన్నడూ చూడని జీవో..
సాధారణంగా ఉద్యోగుల డీఏ బకాయిలను వారి జీపీఎఫ్‌కు జమ చేసేలా ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తాయి. దీనికి భిన్నంగా ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్‌ఎస్ సమయంలో 21 నెలల డీఏ బకాయిలను చెల్లిస్తామని తొలుత ఇచ్చిన జీవోలో పేర్కొనడంపై నివ్వెరపోయారు. డీఏలకే ఇలా చేస్తే పెండింగ్‌లో ఉన్న రూ.34 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటని మథనపడుతున్నారు. డీఏ బకాయిలను గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేశాయని గుర్తు చేస్తున్నాయి.
ఇది మోసపూరిత, దగాకోరు సర్కారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి ముందు రోజు నమ్మించి గొంతు కోశారని, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. డీఏ ఉద్యోగుల వేతనంలో భాగమని, అది ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారమని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. డీఏ అనేది పదవీ విరమణ బెనిఫిట్ కాదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంటున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు చెల్లించే డీఏ ఖర్చును వారి సొంత నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
పెన్షనర్లపై పిడుగు..
ఉద్యోగుల మాదిరిగానే పెన్షనర్లను కూడా చంద్రబాబు సర్కారు నిలువునా మోసం చేసింది. పెన్షనర్లకు గత ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తొలుత జీవో 61 జారీ చేసింది. పెన్షనర్లకు 21 నెలల డీఏ బకాయిలు (01–01–2024 నుంచి 30–09–2025 వరకు) 2027–28 ఆర్థిక ఏడాదిలో 12 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అందులో పేర్కొంది. దీనిపై పెన్షనర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు ఆర్థిక సంవత్సరాల తరువాత బకాయిలు చెల్లిస్తామనడం దారుణమని, గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలాంటి జీవోలను జారీ చేయలేదని, దీపావళికి డీఏ అంటూ నయ వంచనకు పాల్పడ్డారని పెన్షనర్లు, టీచర్ల సంఘాలు భగ్గుమనడంతో అనంతరం సవరణ జీవోలు వెలువడ్డాయి.
తక్షణం సవరించాలి: ఉపాధ్యాయ సంఘాలు
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని నిబంధనలను ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు జీవోలు 60, 61లో పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ యుటీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. పెన్షనర్ల డీఏ బకాయిలను 2027–28లో 12 వాయిదాల్లో చెల్లిస్తామనడాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు. తక్షణం జీవోలకు సవరణలు చేసి ఉద్యోగుల బకాయిలను జీపీఎఫ్‌కు జమ చేయాలని, పెన్షనర్లకు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: పీఆర్‌టీయూ
గతంలో ఎన్నడూ లేని విధంగా డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ తరువాత చెల్లిస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీఆర్‌టీయూ ఒక ప్రకటనలో తెలిపింది. పెన్షనర్లకు డీఏ బకాయిలను 2027–28లో చెల్లిస్తామనడాన్ని ఖండించింది. సీపీఎస్ గురించి జీవోల్లో ప్రస్తావించకపోవడం సరికాదని, వెంటనే జీవోలను సవరించాలని పీఆర్‌టీయూ డిమాండ్ చేసింది.
గతంలో మాదిరిగానే ఇవ్వాలి: ఏపీటీఎఫ్
పెన్షనర్లు, ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు విధానం సంప్రదాయానికి భిన్నంగా ఉందని ఏపీటీఎఫ్ ఒక ప్రకటనలో ఖండించింది. వెంటనే జీవోలను సవరించాలని, గతంలో మాదిరిగానే డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది.
ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి: ఆప్టా
ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దీనికి తోడు డీఏ జీవో చాలా దారుణంగా ఉందని ఆప్టా అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షనర్లకు డీఏ బకాయిలను 2027–28లో చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల గురించి జీవోలో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. తక్షణమే డీఏ మంజూరు జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు.
తరువాత ఇస్తామనడం దారుణం: సచివాలయ అసోసియేషన్
ఉద్యోగులకు 21 నెలల డీఏ బకాయిలను పదవీ విరమణ తరువాత ఇస్తామనడం తీవ్ర నిరాశకు గురి చేసిందని రాష్ట్ర సచివాలయ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎప్పుడూ డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారని, పదవీ విరమణ నాటికి వాయిదా వేయడం ఇదే తొలిసారని తెలిపింది. ఇది ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగించే అంశమని, డీఏ జీవోలను సవరించి బకాయిలను వెంటనే జమ చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
బకాయిలు వెంటనే చెల్లించాలి: పెన్షనర్ల అసోసియేషన్
పెన్షనర్ల డీఏ బకాయిలను 2027–28లో వాయిదాల్లో చెల్లిస్తామనడం సరికాదని, బకాయిలను నగదు రూపంలో వెంటనే చెల్లించాలని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. మిగిలిన మూడు డీఏలను కూడా వెంటనే మంజూరు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
డీఏ ఉత్తర్వుల్లో మార్పులు.. మళ్లీ మెలికలు
3 వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాలకు చెల్లించేలా ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను రిటైర్‌మెంట్ తర్వాత చెల్లిస్తామని ప్రకటిస్తూ సోమవారం 60, 61 జీవోలిచ్చిన ప్రభుత్వం.. మంగళవారం ఆ ఉత్తర్వులను సవరించింది. ఈమేరకు జీవో నం.62, 63ని జారీ చేసింది. అయితే, సవరించిన జీవోల్లోనూ ఉద్యోగులకు, పెన్షనర్లకు నష్టమే కలిగేలా చేసింది. ఏడాదిలోపు మూడు వాయిదాలలో డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
ఆ మొత్తాన్ని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని జీవోలో సవరణ చేసింది. సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదిలోపు మూడు వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం డీఏ అరియర్స్‌లో 10 శాతం 2026 ఏప్రిల్‌లో, 30 శాతం ఆగస్టులో, 30 శాతం నవంబర్‌లో, మిగిలిన 30 శాతం ఫిబ్రవరి 2027లో చెల్లిస్తామని ప్రకటించింది.
అయితే, ఓపీఎస్ ఉద్యోగులకు మొత్తం పీఎఫ్ ఖాతాలో, సీపీఎస్ ఉద్యోగులకు 10 శాతం ప్రాన్ ఖాతాలో జమ చేస్తామని, మిగిలిన మొత్తం మూడు విడతలుగా చెల్లిస్తామని పేర్కొంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఆయా నెలవారీ విడతల్లో నగదుగా చెల్లిస్తారు. అయితే, సవరణ ఉత్తర్వులతో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదని, ఇది కేవలం కంటితుడుపు చర్చేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
జీవోల సవరణ కంటితుడుపు చర్యే
ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యం సవరణ ఉత్తర్వులు కంటితుడుపుగా మాత్రమే ఇచ్చినట్టు ఉంది. ఈ ఉత్తర్వులు ఏ ఒక్కరినీ సంతృప్తి పరిచే విధంగా లేవు. ఫిబ్రవరి 2027కు బకాయిల చెల్లింపులు పూర్తయ్యేలా ఉత్తర్వుల్లో తెలపడం అన్యాయం. ఇవ్వాల్సిన హక్కుపై సీలింగ్ విధించడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు. ఈ ఏడాది నవంబర్‌లో బకాయిలు మొత్తం ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి.
సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం నగదుగా చెల్లించాలి. పెన్షనర్లకు 100 శాతం నగదుగా చెల్లించాల్సిందే. మిగిలిన 3 డీఏలను కూడా వెంటనే ప్రకటించాలి. ఉద్యోగ విరమణ తర్వాత బకాయిలు చెల్లిస్తామన్న నిబంధన సవరణ స్వల్ప ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారంగా కనిపించలేదు.
– సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు