
ఉద్యోగుల పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం
ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బాబు మాయమాటలు
వైఎస్ జగన్ హయాంలో 11 డీఏలు ఇచ్చారు..
బాబు పాలనలో ఇంకా మూడు డీఏలు పెండింగ్
వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్
ఆ తరువాత పీఆర్సీ సిఫార్సులను అమలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ టక్కుటమార విద్యను ఈ సారీ ఆయన వదులుకోలేదు. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు ఇప్పుడు వారిని దీపావళి సాక్షిగా నిలువునా మోసగించారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారంలోకి రాగానే డీఏలతోపాటు ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన 16 నెలలు తరువాత ఒక్క డీఏ మాత్రమే మంజూరు చేశారు. మూడు డీఏలను తొక్కిపెట్టారు. మంజూరు చేసిన డీఏనూ ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తామంటూ ఎన్నడూ లేని వింత విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
పీఆర్సీ, ఐఆర్ ఊసే లేదు
ఎన్నికల ముందు మెరుగైన పీఆర్సీ, ఐఆర్ అంటూ కల్లబోల్లి మాటలు చెప్పిన చంద్రబాబు 16 నెలలైనా పీఆర్సీ అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్‌తో రాజీనామా చేయించారు. ఇప్పటి వరకు పీఆర్సీ కమిషనర్‌ను నియమించలేదు. రూ.34వేల కోట్ల పెండింగ్ బకాయిలు అతీగతీ లేవు. ఆరు నెలల్లోనే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను గాడిలో పెడతానని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తామని, పోలీసులకు శని, ఆదివారాల్లో సెలవులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. పైగా ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ చేశాక ఇస్తానంటూ తాజాగా జీవో జారీ చేశారు.
జగన్ హయాంలో 27 శాతం ఐఆర్
వైఎస్ జగన్ తన హయాంలో ఉద్యోగులకు అడుగడుగునా అండగా నిలిచారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా 11 డీఏలను మంజూరు చేశారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేశారు. ఆ తరువాత పీఆర్సీ సిఫార్సులను అమలు చేశారు. రెండేళ్లపాటు కరోనా వెంటాడినా సరే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు.