
బిల్లుల కోసం యజమానుల వీధి పోరాటం
గురువారం చలో విజయవాడకు పిలుపు
ధర్నాచౌక్‌లో వైద్యులతో కలిసి ఆందోళన
చరిత్రలో తొలిసారిగా ఆస్పత్రుల యజమానుల ధర్నా
13 రోజులుగా రాష్ట్రంలో నిలిచిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు
సాక్షి, అమరావతి: అణిచేకొద్దీ ఎగసిపడే అలలా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె రోజురోజుకు తీవ్రం అవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఆస్పత్రుల యజమానులు వీధి పోరాటానికి పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా గురువారం ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) చలో విజయవాడ చేపట్టనుంది. ధర్నా చౌక్‌లో రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు వైద్యులతో కలిసి మహా ధర్నాకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లుల మంజూరు కోసం నెట్‌వర్క్ ఆస్పత్రులు ఏకంగా ధర్నాకు సిద్ధమవ్వడం వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు సమ్మె చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల యజమాన్యాల ఆగ్రహం కట్టలు తెగుతోంది. ఇంతటి అధ్వాన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారి అని అందరినోటా వినిపిస్తోంది.
తమ ధర్నాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఏపీ ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషన్, ఏపీ జూడా, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు ఉందని ఆశ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ ప్రకటించారు. ఈ సంఘాల ప్రతిని«ధులు విజయవాడ ధర్నాకు తరలివస్తారని వెల్లడించారు.
పేదలను తరిమేస్తున్న దుస్థితి
కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు బకాయి పెట్టడంతో నెల రోజులకు పైగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నాయి. గత 13 రోజులుగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో వెళ్లినవారికి సేవలు అందించబోమని నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు తేల్చి చెబుతున్నారు. డబ్బు చెల్లిస్తేనే వైద్యం... లేదంటే వెళ్లిపొమ్మంటూ పేదలను పంపేస్తున్నారు.
ప్రైవేట్‌లో ఉచిత వైద్యం అందక ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే అక్కడా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. రూ.670 కోట్లు విడుదల చేస్తే వైద్య సేవలు పునరుద్ధరిస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు చెబుతున్నా ప్రభుత్వ పెద్దలు కనీసం చెవికి ఎక్కించుకోవడంలేదు. గోడు వెళ్లబోసుకోవడానికి కనీసం అపాయింట్‌మెంట్‌లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలందరూ ముఖం చాటేస్తున్నారని ఆస్పత్రుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.