breaking news
Private Network
-
ఆరోగ్యశ్రీ ఆగి..మంచం మీద రోగి
రాజమండ్రికి చెందిన రమేశ్‌కు మంగళవారం ప్రమాదవశాత్తూ కాలు విరగడంతో అదే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. తాను ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడినని ఉచితంగా చికిత్స చేయాలని కోరాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలేదని, ఉచిత చికిత్సలు నిలిపేశామని సిబ్బంది చెప్పారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామన్నారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని రూ.లక్ష వరకూ అవుతుందని చెప్పడంతో రమేశ్ కుటుంబ సభ్యుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. అంత డబ్బు తమ వద్ద లేదని, రూ.5వేలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా కట్టుకట్టి, మందులు ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభించాక కబురుపెడతాం. అప్పుడు వస్తే శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు సూచించారు. చేసేదేమీ లేక వైద్యులు చెప్పినట్టుగానే తాత్కాలికంగా కట్టు కట్టించుకుని రమేశ్‌ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇదే ఆస్పత్రికి సోమవారం ఒక వ్యక్తి కాలి మడమ విరిగిందని వచ్చాడు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు నిలిపేశామని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.40వేలు కట్టి చికిత్స చేయించుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు శ్రీనివాస్ ఇటీవల వరకు విజయవాడలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నాడు. యథావిధిగా సోమవారం డయాలసిస్ చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చాడు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశామని, డయాలసిస్ సేవలు కూడా ఆపేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ ప్రారంభించే వరకూ డబ్బు చెల్లిస్తేనే డయాలసిస్ చేస్తామన్నారు. దీంతో డయాలసిస్ ఆపేస్తే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న తమ పరిస్థితి ఏమైపోవాలని శ్రీనివాస్‌తోపాటు మరికొందరు రోగులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్య తరగతి రోగులు వైద్యసేవల కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టి నెల రోజులు గడిచిపోయింది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపివేసి వారం రోజులైంది. ఎక్కడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో జనాలు ఏమైపోతే మనకేంటి... అన్నట్టుగానే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలో 1.42 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీమా ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వర్యం చేశారు. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దీంతో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కలిపి రూ.3వేల కోట్లకు పైగా ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిపడింది. సాధారణంగా చికిత్సలు అందించిన 40 రోజుల్లో ఆస్పత్రులకు అందాల్సిన బిల్లులు ఏడాది గడిచినా కనీసం ప్రాసెస్‌కు కూడా నోచుకోని దుస్థితి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో నెలకొంది. ఆస్పత్రుల నుంచి వచి్చన 10 లక్షలకు పైగా క్లెయిమ్‌లను ట్రస్ట్ స్థాయిలోనే ప్రభుత్వం తొక్కి పెట్టింది. వీటి విలువ రూ.2వేల కోట్లకు పైనే ఉంటుందని తెస్తోంది. మరో రూ.650 కోట్ల మేర సీఎఫ్ఎంఎస్లో బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయిందని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నాయి. వీటి విలువ రూ.300 కోట్ల పైమాటే. ఇలా అన్ని రకాల బిల్లులు రూ.3వేల కోట్లకు పైనే చెల్లింపులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఆస్పత్రికి రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు బిల్లులు రావాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని యజమానులు చేతులెత్తేసి సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఒకసారి ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎంతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల 15 నుంచి మరోమారు ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్ సేవలు నిలిపేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయి సేవలు ఆపేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి బారినపడి ఇటీవల ఏకంగా 45 మందికిపైగా మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యారి్థనులు పెద్ద ఎత్తున పచ్చకామెర్ల బారినపడి అల్లాడుతున్నారు. వారిలో ఇద్దరు మరణించారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ డిమాండ్ల సాధన కోసం పీహెచ్సీ వైద్యులు సమ్మె చేస్తున్నారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ విజయవాడకు వచ్చి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీంతో గ్రామీణ, గిరిజన మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. అనారోగ్యం బారినపడిన ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో నాడిపట్టే వారు లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే... అక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు.దీంతో రోగాలు ప్రబలుతున్నాయి.వైద్యమూ అందడం లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నెలకొన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. పెళ్లిళ్లు, పుస్తక ఆవిష్కరణలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు, వీకెండ్లో హైదరాబాద్ పర్యటనలకు సమయం కేటాయిస్తున్న ప్రభుత్వ పెద్దలు... ప్రజారోగ్యంపై సమీక్ష చేసేందుకు సమయం కేటాయించకపోవడం గమనార్హం. సమ్మె మరింత ఉధృతంప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమకు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల మద్దతు కూడా ఉందని వెల్లడించింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేయడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది.శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తిరుపాల్‌నాయక్ అనే కూలికి ఈ నెల 13న రాత్రి పురుగు కుట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో చూపించుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి వైద్యులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేసు చూడటం లేదన్నారు. దీంతో అతను రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం కంతా తొడభాగం దెబ్బతినగా.. స్థానిక వైద్యుల సూచన మేరకు 14వ తేదీ (మంగళవారం) అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవలు(ఆరోగ్యశ్రీ) బంద్ అయినట్లు చెప్పడంతో ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వెళ్లాడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు లేకపోతే ఎలాగంటూ తిరుపాల్ నాయక్ భార్య లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులు రోజూ పదుల సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నాయి.ఆరోగ్యశ్రీ లేక అవస్థలునేను నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాను. సర్జరీ చేస్తానని సుమారు 15 రోజుల క్రితం తేదీ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్పత్రికి వచ్చాను. ఆరోగ్యశ్రీ నిలిపేశారని చెప్పి సర్జరీ చేయలేమని చెప్పారు. నాకు సకాలంలో సర్జరీ చేయకపోతే మెదడుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైద్యులే చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత మాకు లేదు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్ల సేవలకు అంతరాయ ఏర్పడడం దారుణం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.– చలమల సాయి శ్రీధర్, కాకినాడవెన్నెముక సమస్యతో వచ్చాం..నాకు కొన్ని నెలలుగా వెన్నెముక సమస్య ఉంది. దాంతోపాటు విపరీతమైన కీళ్ల నొప్పులున్నాయి. ఆరోగ్యశ్రీ ఉందని ప్రైవేటు ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడకు వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు నిలిపేశామని చెప్పారు. రూ.200 ఇచ్చి ఓపీ తీసుకున్నాం. డాక్టర్ దగ్గరికి వెళితే కొన్ని రకాల రక్త పరీక్షలు రాశారు.వాటికి రూ.5వేల దాకా ఖర్చు అయింది. ఆరోగ్యశ్రీని నమ్ముకుని వచ్చాం. అప్పు చేసి ఆరోగ్యానికి వెచ్చించాల్సి వచ్చింది. ఇలాగైతే పేదలకు ఇబ్బందే. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడంతోపాటు పేదలకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలి. – రామకృష్ణ, చెర్లోపల్లి, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
'ప్రైవేట్ టెల్కో నెట్వర్క్ అవసరం లేదు'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టెలికం నెట్వర్క్ కవరేజీ ఉన్న నేపథ్యంలో కంపెనీలు సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం దాదాపుగా లేదని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ వ్యాఖ్యానించారు.ప్రజలకు టెలికం కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉన్న చోట్ల లేదా అస్సలు లేని కనెక్టివిటీనే లేని భౌగోళిక ప్రాంతాల్లో, చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటివి కావాలి తప్ప భారత్‌లో అనవసరమని తెలిపారు. కంపెనీలు తమ ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలైన అవసరాల కోసం, నేరుగా టెలికం శాఖ నుంచి స్పెక్ట్రంను తీసుకుని, సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కొచ్చర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడే టెలికం మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ భారత్ నిధికి మరింతగా నిధులను సమకూర్చగలిగితే ఇంకా కనెక్టివిటీ అంతగా లేని ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కొచ్చర్ పేర్కొన్నారు. -
సొంత వ్యాపారం కోసమే స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటోందన్న విషయం వెలుగు చూసిన తర్వాత విశ్లేషకుల నుంచి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. వ్యాపార అవసరాల కోసమే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్టు ముందు చెప్పినట్టుగానే అదానీ గ్రూపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 5జీ స్పెక్ట్రమ్ కోసం మూడు టెలికం కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. కానీ, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ డేటా నెట్వర్క్స్ (ఏడీఎన్ఎల్) కేవలం రూ.212 కోట్లనే స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు కేటాయించింది. తద్వారా 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల కాలానికి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ వేలంలో అదానీ పెట్టుబడి 0.15 శాతంగానే ఉండడం గమనించాలి. తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌తో ప్రైవేటు నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని, దాన్ని డేటా సెంటర్లు, గ్రూపులోని ఇతర కార్యకలాపాలు, అన్ని వ్యాపారాల కలబోతతో ఉండే సూపర్ యాప్ కోసం వినియోగించుకుంటామని అదానీ గ్రూపు పేర్కొంది. అదానీ గ్రూపు కీలక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, బీటూసీ వ్యాపారాల డిజిటైజేషన్ వేగవంతం చేయడానికి 5జీ స్పెక్ట్రమ్ సాయపడుతుందని అదానీ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. -
ఎయిర్టెల్, టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాయి. -
గ్రామాల్లోనూ వైఫై సేవలు
పోచమ్మమైదాన్ : ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ప్రజలకు సేవలందించేందుకు ముందుకు సాగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో మారుమూల గ్రామాలకు సైతం భారత్ సంచార్ నిగామ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పబ్లిక్ గార్డెన్, హన్మకొండ బస్టాండ్, వేయ్యిస్తంభాల దేవాలయం, భద్రకాళి, స్టేషన్‌రోడ్డు, మదనతుర్తి, పస్రాలలో వైఫై సేవలు అందిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా పెంచికల్‌పేట, జంగాలపల్లి, కల్లెడ, అన్నారం షరీఫ్, తీగరాజుపల్లి, రెడ్లవాడ, అలంకానిపేట, ముప్పారం, పెనుగొండ, చిన్నముప్పారంలలో గ్రామస్తుల సహకారంతో ఫైబర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో మార్చి 31 నాటికి ప్రజల భాగస్వామ్యంతో 300 గ్రామాల్లో వైఫై సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ముందుకుసాగుతున్నది. వారం రోజుల్లో సేవలు ప్రారంభం : పీజీఎం నరేందర్ మరో వారం రోజుల్లో మొదటి విడతలో భాగంగా పది గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వైఫై సేవలు ప్రారంభిస్తున్నాం. ఫైబర్ కేబుల్ ద్వారా ఈ సేవలను అందించనున్నాం. వైఫై సేవలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే 3జీ సిమ్‌లను ఉచితంగా అందజేస్తాం. ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలి.