
వాల్ నాణ్యత, పటిష్టత సమగ్రంగా తేల్చేందుకు మరిన్ని పరీక్షలు అవసరం
పోలవరం ప్రాజెక్టు అథారిటీకి విదేశీ నిపుణుల కమిటీ ఐదో నివేదికలో వెల్లడి
నిపుణుల సిఫార్సులను అమలు చేయకపోవడం వల్లే ఈ సమస్య అంటున్న ఇంజనీరింగ్ వర్గాలు
డీ వాల్ మందం 900 మి.మీ. కంటే తక్కువగా ఉన్నా ఆమోదించాలని కాంట్రాక్టు సంస్థ ప్రతిపాదన
దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని పీపీఏకు తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ
1,500 మీటర్ల మందం.. 0.3 శాతం టోలరెన్స్‌తో డీ వాల్ నిర్మించేలా డిజైన్‌కు సీడబ్ల్యూసీ ఆమోదం
దానికి విరుద్ధంగా డీ వాల్ నిర్మిస్తుండటాన్ని గత పర్యటనలో ఆక్షేపించిన నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ (డీ వాల్)లో బ్లీడింగ్ (నీటి ఊట) యధాతథంగా కొనసాగుతోందని విదేశీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డీ వాల్ నాణ్యత, పటిష్టతను సమగ్రంగా తేల్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి సూచించింది. జూన్ 4న ఇచ్చిన నాలుగో నివేదికలో సైతం డీ వాల్‌లో నీటి ఊట ఉండటాన్ని ప్రస్తావించామని గుర్తు చేసింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 1,500 మిల్లీమీటర్ల (1.5 మీటర్లు) మందంతో డీ వాల్‌ను నిర్మించేలా డిజైన్‌ను ఆమోదిస్తే క్షేత్రస్థాయిలో 900 మిల్లీమీటర్లు (0.9 మీటర్లు) కనీస మందంతో పనులు చేస్తున్నారని నాలుగో నివేదికలో నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం ఒక ప్యానల్‌ను మరో ప్యానల్‌తో జత చేసినప్పుడు విచలనం వల్ల మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుందంటూ కాంట్రాక్టు సంస్థ బావర్ ప్రతిపాదించిందని పేర్కొంది.
ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డీ వాల్ మందంపై బావర్ సంస్థ ప్రతిపాదనపై సమగ్రంగా అధ్యయనం చేసి పటిష్టతను అంచనా వేయాలని పీపీఏకు సూచించింది. 32 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని డీ వాల్‌లో వినియోగించాలని పునరుద్ఘాటిస్తూ ఈనెల 2న పీపీఏకు విదేశీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
గియాన్ ఫ్రాంకో డీ సిక్కో (అమెరికా), రిచర్డ్ డొన్నెళ్లి (కెనడా), డేవిడ్ పాల్(అమెరికా)లతో కూడిన విదేశీ నిపుణుల కమిటీ ఐదోసారి ఆగస్టు 29 నుంచి 31 వరకూ పోలవరం పనులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించింది. పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశాలు నిర్వహించింది. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులు.. నాణ్యతకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తూ పీపీఏకు నివేదిక సమర్పించింది.
డీ వాల్ పనుల్లో తీవ్ర జాప్యం..
గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేశాకే ప్రధాన డ్యాం పునాది (డీ వాల్)ను నిర్మించాలి. కానీ.. వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే 2016 నవంబర్ నుంచి 2018 జూన్ మధ్య రెండు దశల్లో ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1396.6 మీటర్ల పొడవున డీ వాల్‌ను అప్పటి చంద్రబాబు సర్కార్ పూర్తి చేసింది. 2017 జూన్ తర్వాత గోదావరికి వచ్చిన భారీ వరదకు డీ వాల్ కోతకు గురై దెబ్బతింది. 2018 జూన్ తర్వాత గోదావరికి వచ్చిన వరదలకు డీ వాల్ మరింతగా దెబ్బతింది. దాంతో డీ వాల్‌కు అప్పట్లో చేసిన వ్యయం రూ.440 కోట్లు గోదారి పాలయ్యాయి.
చంద్రబాబు సర్కార్ ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.21 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి ఉండేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదంతో దెబ్బతిన్న డీ వాల్‌కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా 1.5 మీటర్ల మందం, 0.3 శాతం టోలరెన్స్ (భ్రమణం, విచలనం)తో కొత్తగా డీ వాల్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఖరారు చేసింది. ఆ మేరకు డీ వాల్ నిర్మాణ పనులను రూ.990 కోట్లకు బావర్ సంస్థకు అప్పగించారు.
ఆగస్టు 28 నాటికి 152 ప్యానళ్ల పరిధిలో డీ వాల్‌ను పూర్తి చేసింది. మొత్తం 66 వేల చదరపు మీటర్ల పరిధిలో డీ వాల్ పనులు చేయాల్సి ఉండగా 32,400 చ.మీ. పనులు అంటే 49 శాతం పూర్తి చేసింది. షెడ్యూలు ప్రకారం ఆగస్టు నాటికి 40,100 చ.మీ. పనులు పూర్తి కావాలి. షెడ్యూలు కంటే 7,700 చ.మీ. (20 శాతం) తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. డీ వాల్ పనుల్లో జాప్యం పెరుగుతోందని పేర్కొంది. డీ వాల్ పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ పేర్కొందని నిపుణుల కమిటీ ప్రస్తావించింది.
అత్యంత కఠిన శిల పొర (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల మేర ప్యానళ్లను దింపి.. డీ వాల్ నిర్మిస్తున్నందువల్లే జాప్యం చోటుచేసుకుంటోందని కాంట్రాక్టు సంస్థ చెప్పడం సహేతుకం కాదంటూ నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం డీ వాల్ నిర్మిస్తున్న చోటుకు 6 మీటర్ల దిగువన గతంలో డీ వాల్ నిర్మించారని.. ఆ రికార్డులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సౌండ్ హార్డ్ రాక్‌ను గుర్తించడం పెద్ద సమస్య కాదని స్పష్టం చేసింది.
ఇక బంకమట్టి నేల ఉన్న ప్రాంతం (950 మీటర్ల చైనేజ్ నుంచి)లో డీప్ సాయిల్ మిక్సింగ్(డీఎస్‌ఎం) పద్ధతిలో నేలను పటిష్టం చేసి డీ వాల్ నిర్మిస్తామన్న డిజైనర్ ఆఫ్రి చేసిన ప్రతిపాదనను నిపుణుల కమిటీ ఆమోదించింది. ఆ ప్రాంతంలో డీ వాల్ పనులను ఇప్పటికే అందుబాటులో ఉన్న పరికరాలతోనే పనులు చేయవచ్చునని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి నాటికి డీ వాల్ పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది.
సీడబ్ల్యూసీ డిజైన్‌కు విరుద్ధంగా..
కొత్త డీ వాల్‌ను 1.5 మీటర్ల మందంతో 1,396.6 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో (పునాది) నిర్మించేలా డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డీ వాల్‌ను నిర్మించాలని నిర్దేశించింది. కఠిన రాతి శిల పొర తగిలే వరకూ భూమిని కట్టర్లు, గ్రాబర్లు తవ్వుతూ ప్యానళ్లను దించుతూ వెళ్లాలి. ఆ ఖాళీ ప్రదేశంలో బెంటనైట్ మిశ్రమాన్ని నింపాలి. కఠిన రాతి శిల పొర లోపలికి రెండు మీటర్లు ప్యానళ్లను దించాక టీ–16 కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది.
కొంత బెంటనైట్ మిశ్రమం టీ–16 కాంక్రీట్‌తో కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా మారి పటిష్టమైన గోడగా మారుతుంది. అదే డీ వాల్. డీ వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డీ వాల్ మందం గరిష్టంగా 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సీడబ్ల్యూసీ పేర్కొంది.
కానీ.. 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) కనీస మందంతో డీ వాల్ పనులు చేస్తోందని జూన్ 4న ఇచ్చిన నాలుగో నివేదికలో నిపుణుల కమిటీ పేర్కొంది. ఇప్పుడు కనీస మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆమోదించాలని బావర్ ప్రతిపాదించింది. మందం తగ్గితే డీ వాల్ సామర్థ్యం, నాణ్యత ఎలా ఉంటుందన్నది తేల్చాల్సిన బాధ్యత పీపీఏదేనని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. డీ వాల్ ఊట నీటిని సమర్థవంతంగా నియంత్రించడంపైనే ప్రధాన డ్యాం భద్రత ఆధారపడి ఉంటుంది.
అధిక నీటి శాతం, ఉష్ణోగ్రత వల్లే ఊట..
డీ వాల్‌లో వినియోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని తొలి నుంచి నిపుణుల కమిటీ చెబుతూ వస్తోంది. కానీ.. డీ వాల్ వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత అధికంగా ఉందని గతంలోనే తెలిపింది. ప్లాస్టిక్ కాంక్రీట్‌లో నీటి శాతం అధికంగా ఉన్నట్లుగా గత పర్యటనలో పసిగట్టింది.
కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత, నీటి శాతం ఎక్కువగా ఉండటం, ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేక పోవడం వల్లే.. సిమెంట్, బెంటనైట్, కంకర, ఇసుక, నీరు విడిపోతోందని (సెగ్రిగేట్), దాని వల్ల అది పటిష్టంగా, నాణ్యంగా ఉండదని గత నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీని వల్ల డీ వాల్‌లో ఊట నీరు వస్తోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సులను సమర్థంగా అమలు చేయకపోవడం వల్లే డీ వాల్‌లో ఊట నీటి సమస్య కొనసాగుతోందని ఇంజనీరింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.