కల్యాణి ప్రియదర్శన్‌కు పెళ్లి అయ్యిందా? | - | Sakshi
Sakshi News home page

కల్యాణి ప్రియదర్శన్‌కు పెళ్లి అయ్యిందా?

Oct 24 2024 1:40 AM | Updated on Oct 24 2024 8:04 AM

-

తమిళసినిమా: సామాజిక మాధ్యమాల హవా పెరిగిన తరువాత ప్రచార విధానంలో పెనుమార్పులు సంతరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా వార్త అయిపోతోంది. ముఖ్యంగా సినీ తారల విషయంలో ప్రతి విషయం ఆసక్తికరంగా మారిపోతోంది. దీన్ని సినిమా వాళ్లు, తారలు కూడా బాగా ఉపయోగించుకుంటున్నారనే చెప్పాలి. దీంతో ఏ వార్తలో నిజమెంత అన్నది అధికారికంగా వెల్లడించే వరకూ తెలియని పరిస్థితి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వారి గురించి చాలా గ్యాసిప్స్‌ సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంటాయి. 

పలాన వ్యక్తితో ప్రేమాయణం అని, వారి మధ్య విభేదాలు అని వదంతులు వైరల్‌ అవుతుంటాయి. కొందరు అలాంటి వార్తలను ఎంజాయ్‌ చేస్తే, మరి కొందరు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. అలా ఇటీవల నటి తమన్నా ఒక చిత్రంలో పాత్ర కోసం భక్తురాలి గెటప్‌లో కనిపిస్తే, దానికి ఆమె ఆధ్యాత్మిక మార్గం పట్టారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ పెళ్లి చేసుకున్నారనే వార్త ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ వారసురాలు అన్న విషయం తెలిసిందే. కల్యాణి ప్రియదర్శన్‌ తెలుగు చిత్రం హలో ద్వారా కథానాయకిగా 2017లో తెరంగేట్రం చేశారు. అదే విధంగా తమిళంలో హీరో చిత్రం ద్వారా 2019లో పరిచయం అయ్యారు. ఇక్కడ శింబుకు జంటగా మానాడు వంటి హిట్‌ చిత్రంలో నటించినా ఎందుకనో పెద్దగా స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చుకోలేకపోయారు. అయితే వాణిజ్య ప్రకటనల్లో బాగానే నటిస్తున్నారు. 

ప్రస్తుతం జయంరవికు జంటగా జీనీ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు మలయాళంలో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కల్యాణి ప్రియదర్శన్‌ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలతో సహా వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గురి అవుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటనకు చెందిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండడంతో కల్యాణి ప్రియదర్శన్‌కు పెళ్లి అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఏదేమైనా ఈ 31 ఏళ్ల పరువాల సుందరికి ఇంకా కల్యాణ గడియలు రాలేదన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement