ఫ్రాన్స్‌లో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినీ తారలు మెరిశారు. గత ఏడాది ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ తొలిసారిగా ఈ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈ ఫెస్టివల్ కోసమే అదితీ రావు హైదరి, డయానా పెంటీ ఫ్రాన్స్‌లో ఉన్నారు. నటి తారా సుతారియా కూడా తొలిసారిగా ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ వేదికపై తారా సుతారియాకు ప్రత్యేక సత్కారం జరిగింది.
సంగీతం, థియేటర్ ఆర్ట్స్, నటిగా బహుముఖ ప్రతిభ చూపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది. ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ కార్యక్రమంలో హ్యూమా ఖురేషి సందడి చేశారు. ఇంకా అభినవ్ గోమటం, స్వాతీ శర్మ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తెలుగు చిత్రం ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ టీజర్, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వేణు నక్షత్రం దర్శకత్వంలో అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే జాన్ అబ్రహాం దర్శకత్వంలోని మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘అమ్మ అరియాన్’ రీస్టోర్డ్ 4కే వెర్షన్‌ను ‘కాన్స్ క్లాసిక్’ విభాగంలో ప్రదర్శించారు.
ఈ ఏడాది ఈ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు అమి విర్క్, రూపీ గిల్ లీడ్ రోల్స్‌లో నటించిన పంజాబీ సినిమా ‘చర్దోకలా’ ప్రదర్శితమైంది. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా రూపీ గిల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్న తొలి పంజాబీ సినిమా ‘చర్దోకలా’ కావడం విశేషం. గుజరాతీ నటి–నిర్మాత మానసీ పారేఖ్, సింగర్–నిర్మాత పార్దివ్ గోహిల్, చందు పటేల్ గుజరాతీ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం హాజరై, సందడి చేస్తున్నారు. ఈ నెల 23 వరకూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది.


