రజనీకాంత్‌ కూలీలో శృతిహాసన్‌ | - | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ కూలీలో శృతిహాసన్‌

Jul 7 2024 2:10 AM | Updated on Jul 7 2024 1:37 PM

-

కూలీ చిత్రం చాలా కాస్ట్లీ గురూ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా జరుగుతోంది. నటుడు రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఇది ఆయన నటించే 171వ చిత్రం అవుతుంది. లోకేష్‌కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇది అండర్‌వరల్డ్‌ డాన్‌ల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం ప్రారంభానికి ముందే యూనిట్‌ వర్గాలు ఫస్ట్‌లుక్, టైటిల్‌ ప్రోమోలను  విడుదల చేసి కూలీ చిత్రంపై పెద్ద ఎత్తున హైప్‌ తీసుకొచ్చారు. 

దర్శకుడు లోకేష్‌నకరాజ్‌ కూడా హడావుడీగా చిత్రం షూటింగ్‌కు వెళ్లకుండా కథ, కథనాల కోసం తగినంత టైమ్‌ తీసుకుని పకడ్బందీగా షూటింగ్‌ను ప్రారంభించారు. అలా జూన్‌ నెలలో ప్రారంభం కావాల్సిన కూలీ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభమైంది. అయితే ఈ నెల 10వ తేదీన చెన్నైలో రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. అలా కూలీ చిత్రాన్ని హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో నిర్వ హించాలని దర్శకుడు ప్రణాళికను రచించినట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రం చాలా రేర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కడం విశేషం. 

రజనీకాంత్, లోకేష్‌కనకరాజ్‌ల కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ఇకపోతే చాలా సంవత్సరాల తరువాత నటుడు సత్యరాజ్, రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ఇది. అలాగే ఇందులో లోకనాయకుడి వారసురాలు, సంచలన క్రేజీ నటి శృతిహాసన్‌ తొలిసారిగా రజనీకాంత్‌తో కలిసి నటించడం మరో విశేషం. అయితే ఇందులో ఆమె కథానాయకిగా కాకుండా, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. 

అయితే సమీపకాలంలో ఈమె నటిస్తున్న భారీ బడ్జెట్‌ కథా చిత్రం ఇదే అవుతుంది. అలాగే బిగిల్‌ చిత్రం ఫేమ్‌ నటి రెబా మోనిక మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక యువ సంగీత తెరంగం అనిరుద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా కూలీ చిత్రాన్ని ఈ ఏడాది చివరికంతా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో తెరపైకి తీసుకువచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement