ఆరుగురు మంత్రులపై బాధ్యత
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్న రాకేష్‌రెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. బీజేపీ.. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైన వెంటనే ప్రచారం ఊపందుకోనుంది.
2027 మార్చిలో ముగియనున్న పదవీకాలం
వరంగల్ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఓటర్ల నమోదు కోసం ఎన్నికల అధికారి, నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ షెడ్యూల్ ప్రకటించారు. ప్రస్తుతం పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్‌రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం అనారోగ్యంతో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాకేష్‌రెడ్డినే మరోసారి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అభ్యర్థి ఎంపికకు బీజేపీ కసరత్తు
బీజేపీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. ఆశావహుల పేర్లను పరిశీలిస్తోంది. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఎమ్మెల్సీ అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని.. అదిష్టానం నిర్ణయానికి నాయకులంతా కట్టుబడి ఉంటామని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో మొదలైన సందడి
ఈసారి ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్‌టీయూ తమ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ పేరును ఖరారు చేసింది. ఆయన క్షేత్రస్థాఽయిలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్ కూడా ప్రచారంలోకి దిగారు.
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులపై పార్టీ అధిష్టానం పెట్టినట్లు తెలుస్తోంది. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి సీతక్క ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతలు తీసుకుని.. మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయనున్నారు. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇక ప్రచారంపై దృష్టి పెట్టనుంది. తొలుత పట్టభద్రుల ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయనుంది. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. కాలనీల్లోని గ్రాడ్యుయేట్లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
ఫ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్
ఫ గెలుపు బాధ్యతను ఆరుగురు మంత్రులపై పెట్టిన అధిష్టానం
ఫ బీఆర్‌ఎస్ నుంచి రాకేష్‌రెడ్డిని అధికారికంగా ప్రకటించడమే తరువాయి..
ఫ ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ శ్రేణులు
ఫ అభ్యర్థి ఖరారుపై దృష్టిసారించిన బీజేపీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ
కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్
పేరు : రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
తల్లిదండ్రులు : రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వరూధిని
చదువు : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
రాజకీయ పదవులు : 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేస్తున్నారు. ఏఐసీసీ సభ్యుడిగా, తెలంగాణ పీసీసీ సభ్యుడిగా ఉన్నారు.


