భానుపురి (సూర్యాపేట) : వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పంట దిగుబడి అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఏ మండలంలో ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలి.. ఎంత ధాన్యం కొనాలని, ఎన్ని గన్నీ బ్యాగులు అవసరమవుతాయి, రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.
అంచనా మేరకు సాగుకాని వరి
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 3.70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగైంది. మొత్తం 4.90 లక్షల ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశం ఉందని మొదట వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావం నెలకొనడంతో వరిసాగు విస్తీర్ణం లక్ష ఎకరాల వరకు తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో సాగైన వరి విస్తీర్ణంతో సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వర్షాభావం కారణంగా చివరికి రైతు చేతికి ఎంత దిగుబడి వస్తుందనే విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది.
సన్నరకాల సాగే అత్యధికం
రాష్ట్ర ప్రభుత్వం అందించే బోనస్ కోసం వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్నరకం ధాన్యాన్ని సాగు చేసేందుకు మొగ్గుచూపారు. అన్ని ప్రాంతాల రైతులు సన్నరకాలకు సంబంధించిన నారును సిద్ధం చేసుకోగా వాతావరణం అనుకూలించలేదు. ఇప్పటివరకు సాగైన దాంట్లో కేవలం 50వేల ఎకరాలు మాత్రమే దొడ్డు రకాలు సాగు చేయగా.. మిగతావన్నీ సన్న వైరెటీలే ఉన్నాయి. రైతులు నేరుగా ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకుంటారా లేదంటే బోనస్ కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తారా అనే విషయం తెలియడం లేదు. ప్రైవేట్ మార్కెట్‌లో మంచి ధర లభిస్తే కొనుగోలు కేంద్రాల్లో పడే ఇబ్బందుల కన్నా అటువైపే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సాగైన దొడ్డురకం వరి దసరా నాటికి కోతకు వచ్చే అవకాశం ఉండగా.. దీపావళి నాటికి సన్నరకాలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా గన్నీ బ్యాగుల సేకరణ, రవాణా కోసం ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత సీజన్‌లో..
జిల్లాలో సాగైన వరి3.70 లక్షల ఎకరాలు
దిగుబడి అంచనా
10 లక్షల మెట్రిక్ టన్నులు
గత వానాకాలంలో ఇలా..
వరి సాగు 4.72 లక్షల ఎకరాలు
పంట దిగుబడి 12.90 లక్షల మెట్రిక్ టన్నులు
సేకరించిన ధాన్యం 2.30 లక్షల మెట్రిక్ టన్నులు
ఫ ధాన్యం సేకరణకు యంత్రాంగం ప్రతిపాదనలు
ఫ గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా ప్రణాళిక


