భానుపురి(సూర్యాపేట) : విధి నిర్వహణలో ఉపాధ్యాయులు అలసత్వం వహించే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యాశాఖ సెప్టెంబర్ మాస సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సగటు హాజరు కేవలం 69 శాతం మాత్రమే నమోదు కావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు శాతం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 60 శాతం కంటే తక్కువ హాజరు నమోదైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వెంటనే నోటీసులు జారీ చేసి, లిఖితపూర్వక వివరణ కోరాలని ఆదేశించారు.
హాజరు తక్కువ ఉంటే ఇంక్రిమెంట్లు బంద్
ఉపాధ్యాయులకు నెలకు 15 రోజుల కంటే తక్కువ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు ఉంటే తక్షణమే వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఒకే ఉపాధ్యాయుడు వరుసగా మూడు నెలల పాటు ఇదే తీరును పునరావృతం చేస్తే, రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేస్తామన్నారు. వచ్చే నెల నుంచి మండల స్థాయిలోనే కాకుండా, ఉపాధ్యాయుల వారీగా, గురువారం నుంచి జరిగే సమ్మెటివ్ పరీక్షల ఫలితాల మీద ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, క్వాలిటీ కో–ఆర్డినేటర్ హరికష్ణ, జిల్లాలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


