కోదాడ: రెండు సంవత్సరాల క్రితం కోదాడకు మంజూరైన నవోదయ పాఠశాలకు పక్కా భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా నెలరోజులుగా పనులు కొనసాగుతున్నాయి. 22.5 ఎకరాలలలో ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను నిర్మించనున్నారు. నిర్మాణ సంస్థ ఇప్పటికే స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రధాన భవన నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా పనులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు.
ప్రహరీ పనులు పూర్తి
కోదాడ పట్టణానికి సమీపంలో ఉన్న బాలాజీనగర్‌లోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 22.5 ఎకరాల స్థలాన్ని నవోదయ పాఠశాలకు ప్రభుత్వం కేటాయించింది. జూన్‌లో మట్టపల్లి దేవాస్థానం వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈ నవోదయ పాఠశాలకు వర్చవల్‌గా శంఖుస్థాపన చేశారు. రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ పనులను ప్రారంభించగా ఇప్పటికే పాఠశాలకు కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారు.
మూడు రకాల భవనాలు
నవోదయ పాఠశాలకు కేటాయించిన స్థలంలో పాఠశాల భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలను సైతం నిర్మించనున్నారు. పాఠశాలలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది క్వార్టర్స్ కూడా ఇక్కడే నిర్మిస్తారు. రెండు సంవత్సరాల క్రితం జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 6, 7 తరగతుల విద్యార్థులు మాత్రమే ఉండగా వచ్చేవిద్యా సంవత్సరానికి 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇలా 12వ తరగతి వరకు పెంచుకుంటూ పోతారు. అప్పటి వరకు వచ్చే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలను నిర్మిస్తున్నారు.
ఫ రూ.54 కోట్లతో భవన నిర్మాణం
ఫ ముమ్మరంగా సాగుతున్న పనులు
ఫ వచ్చే విద్యాసంవత్సరానికి
అందుబాటులోకి..
ఫ ప్రస్తుతం సూర్యాపేటలో అద్దె
భవనంలో కొనసాగుతున్న పాఠశాల


