సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను విన్న ఎస్పీ వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందన్నారు.
ఆరుతడి పంటలపై
దృష్టి సారించాలి
నాగారం : ఎల్‌నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేనందున రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. సోమవారం మండలంలోని నాగారంబంగ్లా, వర్థమానుకోట గ్రామాల్లో ‘రైతులతో మాట–పంట మార్పిడికి బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉందని, విద్యుత్ కొరత ఏర్పడవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు వరి విస్తీర్ణం తగ్గించి కందులు, పెసర్లు, మినుములు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, కుసుమ, ఆముదం, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్, ఎంపీడీఓ అంజిరెడ్డి, ఏఓ పి.కృష్ణకాంత్, సర్పంచ్‌లు ఆకుల బుచ్చిబాబు, బయ్యం సుజాతవెంకన్న, ఎంపీఓ సుమలత పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలతో ప్రయోజనం
కోదాడరూరల్ : ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో భూ గర్భజలాలు పెరగడానికి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా వీఓఏలు అవగాహన కల్పించాలని డీఆర్‌డీఓ సన్యాసయ్య సూచించారు. సోమవారం పట్టణంలోని మహిళా సమాఖ్య భవన్‌లో మహిళా రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, ఊరకుంటలు, పామ్‌పాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి అనిత, ఎంపీఓ రాంబాబు, డీపీఎం లక్ష్మీనారాయణ, ఏపీఎం పొన్నం వెంకన్న, వెంకయ్య, పరిమళ, వీఓఏ, వీఓబీ పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుని
నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుని ఆలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమశాలలో నిత్యాగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో లక్ష్మీనరసింహుని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ , అర్చకులు పాల్గొన్నారు.


