30 రోజుల్లోనే కుల, నివాస ధ్రువపత్రాలు | - | Sakshi
Sakshi News home page

30 రోజుల్లోనే కుల, నివాస ధ్రువపత్రాలు

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

గట్టుప్పల్‌ : రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం, నివాస ధ్రువపత్రాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజా సేవల హక్కు (రైట్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌) చట్టం కింద పేపర్‌ లెస్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే పత్రాలను గరిష్టంగా 30 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం వారం రోజుల్లోనే అందించనున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా సేవలు అందకపోతే బాధ్యులపై ఉన్నతాధికారులకు అప్పీల్‌ చేసుకునే హక్కును కూడా పౌరులకు కల్పించారు.

ఆన్‌లైన్‌ పర్యవేక్షణతో జాప్యానికి చెక్‌

ప్రతి ఏటా విద్య, ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకింగ్‌, సంక్షేమ పథకాల కోసం వేలాది మంది ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి విచారణలో ఆలస్యం, ఫైళ్లు పెండింగ్‌లో పడటంతో పత్రాల జారీ తీవ్ర జాప్యమవుతోంది. ఫలితంగా విద్యార్థులు అడ్మిషన్లు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు, రైతులు సబ్సిడీలు కోల్పోతున్నారు. ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ ప్రభుత్వం కాలపరిమితి నిబంధన తెచ్చింది. మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ప్రతి దశను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల ఫైలు ఏ దశలో ఉందో, ఆలస్యానికి కారణమైన సిబ్బంది ఎవరో సులభంగా గుర్తించవచ్చు.

దరఖాస్తుల ప్రాసెస్‌.. అప్పీల్‌ విధానం

దరఖాస్తు విధానం మీసేవలో ప్రారంభమై ఆపై గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) పరిశీలనకు వెళ్తుంది. విచారణ అనంతరం జీపీఓ వివరాలను రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ (ఆర్‌ఐ) లాగిన్‌కు పంపుతారు. ఆర్‌ఐ పరిశీలన పూర్తయ్యాక తహసీల్దార్‌ లాగిన్‌కు చేరుతుంది. తహసీల్దార్‌ ఆమోదం పొందిన తర్వాత ధ్రువపత్రం నేరుగా మీసేవ కేంద్రానికి చేరుతుంది. దరఖాస్తు నిర్ణీత గడువులోగా రాకపోయినా లేదా తగిన కారణం లేకుండా తిరస్కరించినా బాధితులు ఉన్నతాధికారులకు అప్పీల్‌ చేసుకోవచ్చు. అప్పీల్‌ ఆధారంగా అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారు.

ఆదాయ ధ్రువీకరణ ప్రతం జారీకి

వారం రోజులే గడువు

ప్రజా సేవల హక్కు చట్టంలోకి

రెవెన్యూ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement