నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లో నిర్వహించిన యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. యూనివర్సిటీ పురోగతి, సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్‌కు వీసీ వివరించారు.
బీఈడీ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ రెగ్యులర్, 1, 3 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంజీయూ పరిధిలోని 13 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు ఎంజీయూ సీఓఈ జి. ఉపేందర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షలను పకర్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
గంజాయి సేవిస్తున్న నలుగురి అరెస్టు
● మరొకరు పరారీ
మేళ్లచెరువు : గంజాయి సేవిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు చింతలపాలెం ఎస్‌ఐ పరమేష్ మంగళవారం తెలిపారు. చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శ్మశానవాటిక వద్ద ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అదే గ్రామానికి చెందిన కేతారపు సాయి, చిన్నపంగు అభిలాష్, సాకి వెంకటేశ్వర్లు, దేశాల నితీష్ ఉన్నారు. తిరుమలగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి పారిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, సిగరెట్ పెట్టె, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రామలింగేశ్వరస్వామి
ఆలయంలో చోరీ
హాలియా : పట్టణంలోని సాగర్ ఎడమ కాల్వ సమీపంలో గల పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీని అపహరించారు. ఆ హుండీని సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వెనుక భాగంలో పగులగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. ఆలయ చైర్మన్ చెరుపల్లి ముత్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాఘవరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


