పెద్దవూర : వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఎరువుల ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. గతంలో పంటలకు వేసే డీఏపీ, యూరియా గుళికల రూపంలో ఉండేది. ఒక్కోటి 50 కిలోల బస్తా మార్కెట్‌లో అందుబాటులో ఉండేది. ఏళ్ల తరబడి కొన్ని రకాలైన పంటలకు రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం మంచిది కాదని తెలిసినా గత్యంతరం లేక రైతులు వీటిని వినియోగిస్తున్నారు. రైతుల ఆరోగ్యానికి సైతం పెద్దముప్పుగా మారిందని భావించిన కేంద్ర ప్రభుత్వం ద్రవరూప యూరియా, డీఏపీలను తయారు చేయించింది. ఇప్పుడు అవే యూరియా, డీఏపీ ఎరువులను ద్రవరూపంలో తీసుకొచ్చారు. మూడేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకి రాగా గతేడాది నుంచి ద్రవ రూపంలో ఉండే డీఏపీ సైతం అందుబాటులోకి వచ్చింది. ఘన రూపంలో ఉండే 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350, యూరియా బస్తా రూ.266 ధర మార్కెట్‌లో ఉంది. కాగా ఇఫ్కో కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన నానో డీఏపీ అర లీటరుకు రూ.600, యూరియా అరలీటరుకు రూ.240 ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీంతో ద్రవరూప యూరియాపై రూ.26, డీఏపీపై రూ.750 వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
ద్రవరూప ఎరువుల ప్రయోజనం
అధికారుల అంచనా ప్రకారం ద్రవరూప ఎరువులతో పంటకు ప్రయోజనం సుమారు 90శాతం ఉంటుంది. అరలీటరు నానో డీఏపీ, యూరియా డబ్బాలు 50 కిలోల బస్తాతో సమానం. ఎకరానికి అరలీటరు నానో డీఏపీ సరిపోతుంది. వరి నాటు వేసేటప్పుడు ఘనరూప డీఏపీ ఎంత విస్తీర్ణంలో వినియోగిస్తామో, అరలీటరు ద్రవరూప డీఏపీ పొలంలో పిచికారీ చేస్తే సరిపోతుంది. ద్రవరూపంలో పిచికారీ చేయడం వలన అదనంగా పోషకాలు సైతం ఉండటంతో మొక్కలు నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తుంది. దీంతో ఆకులలో కిరణజన్య సంయోగక్రియ పెరుగుతుంది. మొక్క వేర్లలో కణజాలం వృద్ధి చెంది, పంట ఉత్పత్తిలో పోషక విలువలు పెంచుతుంది. ఘనరూప ఎరువులు చాలా వరకు మొక్కకు అందకుండా వృథా అవుతాయి. ద్రవరూప ఎరువులు నేరుగా మొక్కపై పిచికారీ చేయడంతో వృథా ఉండదు.
అవగాహన ఏదీ..?
గ్రామాలలో రైతులకు ద్రవరూప ఎరువులపై అవగాహన కల్పించడంలో వ్యవసాయ అధికారులు విఫలమైనట్లు పలువురు పేర్కొంటున్నారు. నానో డీఏపీ, యూరియా మార్కెట్‌లో ఉందని వాటి ప్రయోజనం ఇలా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించటంపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ సగం పూర్తి కావొచ్చింది. కానీ ఇప్పటికీ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలలో నానో డీఏపీని, యూరియాను రైతులకు సరిపడా స్టాక్‌ను అందుబాటులో ఉంచడం లేదు. అలాగే పంటల సాగుపైగ్రామాల్లో అవగాహన సదస్సుల నిర్వహణ కూడా కరువైందని వ్యవసాయ అధికారులపై విమర్శలు ఉన్నాయి.
ద్రవరూప యూరియా, డీఏపీల ఉపయోగంపై రైతులకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. గుళికల ఎరువు కంటే నానో ఎరువులు చాలా మేలైనవి. వరి నాటుకు ముందుగా ఒకసారి మాత్రమే నానో డీఏపీని పొలంలో పిచికారీ చేయాలి. అలాగే నానో యూరియాను లీటర్ నీటికి 2మి.లీ. లేదా 4మి.లీ. చొప్పున కలిపి మొదటగా పంట పెరుగుదల దశలో తర్వాత నెలలోపు పూత దశలో రెండోసారి పిచికారీ చేయాలి. దీంతో రైతులకు సుమారు 8 శాతం పంట దిగుబడి పెరుగుతుంది.
– ఎన్. సత్యనారాయణ,
మండల వ్యవసాయాధికారి, పెద్దవూర
● రైతులకు అందుబాటులో
ద్రవరూప ఎరువులు
● అవగాహన కల్పించడంలో
వ్యవసాయధికారులు విఫలం


