కోదాడరూరల్ : ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం స్థానాలకు చేర్చాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రజల భద్రత కోసం మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్‌లకు పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్‌తో కూడిన రక్షణ సర్టిఫైడ్ కాపీ, స్టిక్కర్‌ను అతికించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఏమైనా ఇబ్బందులకు గురైనట్‌లైతే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆటో ఎక్కడ ఉందనే సమాచారాన్ని పోలీసులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చేరవేయొచ్చన్నారు. దీనిలో టీ సేఫ్ యాప్ కూడా ఉందని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులకు సమాచార చేరి వారు ప్రయాణికులకు రక్షణ కల్పిస్తారన్నారు. విద్యార్థులు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన విద్యార్థినులు ఎస్పీకి ర్యాఖీ కట్టారు. యాప్ రూపొందించిన రమేష్‌రెడ్డిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ కె.శివశంకర్, ట్రాఫిక్ ఎస్‌ఐ బైరెడ్డి అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు విద్యార్థులు పాల్గొన్నారు.


