సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టులో సాగవుతున్న లక్షలాది ఎకరాల వరి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల విజయవంతానికి కృషిచేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెల్లిసైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


