ఎల్‌నినో ప్రభావంతో కురవని వానలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావంతో కురవని వానలు

Jul 16 2026 5:42 AM | Updated on Jul 16 2026 5:42 AM

ఉమ్మడి జిల్లాలో పంటల సాగు ఇలా.. ఈ మాసంలో లోటు వర్షపాతమే

రెండు సార్లు పత్తి విత్తనాలు విత్తాను

మొలిచిన కొద్దిపాటి పత్తి మొక్కలను

కాపాడుకునేందుకు రైతుల తిప్పలు

నాన్‌ ఆయకట్టు ప్రాంతంలో

పత్తి రైతుల దైన్యం

లోటు వర్షపాతంతో

వరిసాగు అంతంతే..

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసినప్పటికీ సరైన వర్షాలు కురవలేదు. కేవలం చిరుజల్లులు మినహా చెరువులు, కుంటలు నిండేలా పెద్దగా వర్షాలు పడలేదు. వర్షాభావంతో వానాకాలం పంటల సాగుకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. పెద్దగా వరిసాగు చేయకపోయినా.. పత్తి మాత్రం భారీగానే వేశారు. నాటిన పత్తి గింజలు మొలిసినప్పటికీ వర్షాల్లేక మొక్కలు వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తే ఇప్పటికే రైతులు గుంటుకలు తోలుకుని, ఎరువులు పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు మొలకలు ఎండిపోయి నష్టపోయే ప్రమాదం నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఆకాశంవైపు ధీనంగా చూస్తున్నారు.

● నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 6,00,103 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, అందులో 5,56,630 ఎకరాల్లో పత్తి, 27,556 ఎకరాల్లో వరి సాగు చేశారు.

● సూర్యాపేట జిల్లాలో 93,892 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 77,337 ఎకరాల్లో పత్తి, 12,252 ఎకరాల్లో వరిసాగు చేశారు.

● యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,94,109 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 95,116 ఎకరాల్లో పత్తి, 91,526 ఎకరాల్లో వరిసాగు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది.

సూర్యాపేట జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే జూన్‌ మాసంలో 95.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 120.4 మిల్లి మీటర్ల వర్షపాతం.. అంటే ఈ మాసంలో దాదాపు 26.1 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఈ మాసంలో ఎల్‌నినో ప్రభావం జిల్లాపై అంతగా చూపలేదు. కానీ జూలై మాసంలో పరిస్థితులు తలకిందులు అయ్యాయి. ఈనెల 15వ తేదీ నాటికి 75.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 15.3 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. మొత్తంగా నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు జిల్లాలో 171.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ 135.7 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసి 20.8 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది.

మఠంపల్లి మండలం రఘునాథపాలెం,

గుండ్లపల్లి, మఠంపల్లి గ్రామాల పరిధిలో గత

నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు నాటినా మొలకెత్తలేదు. 15 రోజుల క్రితం కురిసిన సాధారణ వర్షానికి సైతం రెండవ విడతలో పత్తి విత్తనాలు పెట్టారు. అయితే ఈ 15 రోజుల్లో వర్షం కురవకపోవడంతో నెల రోజుల క్రితం సాగు చేసిన సుమారు 28 ఎకరాల పత్తి చేలు ఇటీవల సాగుచేసిన మరో 13 ఎకరాల పత్తి చేలు వాడిపోతున్నాయి. దీంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది నాలుగు ఎకరాల భూమిలో గతనెల కురిసిన కొద్దిపాటి చినుకులతో పత్తి విత్తనాలు విత్తాను. సరైన వర్షం కురవక మొలకలు రాలేదు. ఈ నెలలో కురిసిన చిరుజల్లులకు మళ్లీ పత్తి విత్తనాలు విత్తాను. ఈ నెలలో కూడా సరైన వర్షం కురవకపోవడంతో మొలక సరిగ్గా రాలేదు. ఇప్పటి వరకు విత్తనాలు, దుక్కి దున్ని, సాళ్లు వేయడానికి దాదాపు రూ.25 వేలు ఖర్చయ్యింది. అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాను. కానీ ఈ ఏడాది వాతావరణం మాత్రం సహకరించడం లేదు.

– లావూరి శ్రీను, పత్తి రైతు, వేణుగోపాలపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement