పెన్‌పహాడ్ : వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై కనీసం చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి రాజ్యాధికారంలో వాటాను ఖరారు చేసేంత వరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మంది వికలాంగులతో కలిసి గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్‌రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండ సైదులు యాదవ్, మున్న మధుయాదవ్, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్


