అర్వపల్లి : అర్వపల్లిలో ప్రతి మంగళవారం జరిగే వార సంత (అంగడి) నిర్వహణకు ఈనెల 17న వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, పంచాయతీ కార్యదర్శి డి.నవీన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు వేలానికి ముందే రూ.10 వేల నగదు ధరావత్ సొమ్మును కార్యదర్శికి చెల్లించాలని పేర్కొన్నారు. 2027 మార్చి వరకు కాంట్రాక్టు కాల పరిమితితో నిర్వహించే ఈ వేలానికి వేలందారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
నిబంధనల మేరకు
పనులు చేయించాలి
నూతనకల్ : వీబీజీ రామ్‌జీ ఉపాధి పనులను నిబంధనల మేరకు సమర్థవంతంగా చేయించాలని అదనపు డీఆర్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు 100 రోజుల పని దినాల నుంచి 120 రోజుల పని దినాలు పెంచినట్లు, అలాగే ఉపాధి హామీ పథకంలో 266 పనులు గుర్తించగా వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా 318 పనులను గుర్తించినట్లు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలను నాటి వాటి సంరక్షణకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునిత, ఎంపీఓ హరిసింగ్, ఏపీఓ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనారసింహుడికి విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీనారసింహస్వామికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల మహోత్సవం అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో వేద మంత్రోచ్చరణల నడుమ నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆల య అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, ఆలయ అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జీపీఎఫ్ సాధించే వరకు పోరాడుదాం
హుజూర్‌నగర్ : ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుంచి ఉద్యోగ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) సాధించే వరకు పోరాటం కొనసాగిద్దామని ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ఆ సమితి డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం అన్యాయ మని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో సమితి జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు రమేష్ బాబు, మల్లికార్జున్, భూషణ్, నర్సిరెడ్డి, గోపాల్‌రెడ్డి, నాగుబాబు తదితరులు పాల్గొన్నారు.


