పది పరీక్షలకు 69 కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు 69 కేంద్రాలు

Mar 7 2026 9:31 AM | Updated on Mar 7 2026 9:31 AM

చిలుకూరు : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 357 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో చదువుకుంటున్న 12,630 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వారి కోసం విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యాశాఖ ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమించింది.

పకడ్బందీగా పర్యవేక్షణ

పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రతి కేంద్రంలో ఒక సీఎస్‌ను, ఒక డీఓ చొప్పున 138 మందిని నియమించారు. సీఎస్‌, డీఓలకు ఇప్పటికే పరీక్షల నిర్వహణపై శిక్షణ కూడ ఇచ్చారు. వీరితో పాటు నలుగురిని ఫ్లయింగ్‌ స్కాడ్స్‌గా నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దానికి తోడు పరీక్ష కేంద్రం పరిధిలోని అన్ని జిరాక్స్‌ షాపులను మూసి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలలో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, వైద్య సిబ్బందితో కూడిన క్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలు

జిల్లాలో పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ నిర్వహింస్తున్నారు. గతేడాది పదవ తరగతి ఉత్తీర్ణత శాతం 96.81గా ఉండగా.. ఈ ఏడాది 100 శాతం సాధించేలా జిల్లా కలెక్టర్‌, డీఈఓ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన ప్రశ్నపత్రాలు

పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్లు రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా కేంద్రానికి చేరాయి. పరీక్ష పేపర్లను రూట్‌ ఆఫీసర్ల ద్వారా మండల కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్లలో భద్ర పరిచారు. పోలీస్‌ సిబ్బంది పర్యవేక్షణలో పెట్టల్లో భద్రపర్చి సీలు వేశారు.

ఈ నెల 14 నుంచి పరీక్షలు

హాజరు కానున్న 12,630

మంది విద్యార్థులు

పర్యవేక్షణకు 138 మంది అధికారులు, సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement